కేజ్రీ.. కొత్త ఆలోచన?

Update: 2017-11-08 17:30 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవులకు పార్టీ వారిని కాకుండా నిపుణులను నియమించాలని నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీలో వారిని ఈ పదవులకు ఎంపిక చేస్తారా? లేదా? అని పక్కన పెడితే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కు రాజ్యసభ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చి పెద్దల సభలో గౌరవాన్ని పొందాలని ఆప్ భావిస్తోంది. ఈ మేరకు రఘురామ్ రాజన్ కు ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇప్పటికే ప్రతిపాదనను పంపారట. అయితే దీనిపై రఘురామ్ రాజన్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది.

మూడు సీట్లలో నిపుణులే....

రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ప్రస్తుతం ఆయన చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు అధ్యాపక వృత్తి అంటే అత్యంత ఇష్టం. అయితే పెద్దల సభలో ప్రవేశించాలని ఎవరికుండదు? రఘురామ్ రాజన్ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారని ఆప్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొత్తం ముగ్గురిని రాజ్యసభకు పంపేంత బలం ఉంది. ఇందులో ఒక సీటు మాత్రం రఘురామ్ రాజన్ కు రిజర్వ్ చేశారు. మిగిలిన రెండు సీట్లలో కూడా నిపుణులను కూడా నియమించాలని కేజ్రీవాల్ ఆలోచిస్తున్నారు. మొత్తం మీద కేజ్రీవాల్ కొత్త ఆలోచన పార్టీకి మైలేజీ తెస్తుందా? లేక పదవులను ఆశించి భంగపడిన నేతల నుంచి అసంతృప్తి ఎదురవుతుందా? అనేది చూడాల్సి ఉంది.

Similar News