కేకల్లేవ్... చపట్లే...చప్పట్లు...!

Update: 2017-11-10 09:03 GMT

ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా సభలో విన్పించే కేకలు, వాకౌట్లు, నిరసనలు ఈ సమావేశంలో కన్పంచలేదు. కేవలం చపట్లు మాత్రమే విన్పించాయి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ శాసనసభను బహిష్కరించిన సంగతి తెలిసిందే. తమ పార్టీ నుంచి చేర్చుకున్న 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, నలుగురు మంత్రులను బర్త్ రఫ్ చేస్తేనే తాము అసెంబ్లీకి వస్తామని ప్రకటించింది. దీంతో ప్రతిపక్షం లేకుండానే ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు సభలో చంద్రబాబు ప్రసంగానికి అడుగడుగునా చప్పట్లే విన్పించాయి. చంద్రబాబు పట్టిసీమ విశిష్టత, దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలను గురించి వివరించారు. పట్టిసీమ పై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ కూడా ఇచ్చారు.

లోకేష్ జవాబు చెబుతున్నా....

ఇక చినబాబు నారాలోకేష్ తొలిసారి అసెంబ్లీలో ప్రసంగించారు. ప్రతిపక్షం లేకుండా ఆయన ప్రసంగాన్ని అధికార పార్టీ సభ్యులు శ్రద్ధతో విన్నారు. ప్రతి పదానికి చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని తెలియజేసుకున్నారు. నారాలోకేష్ పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ హయాంలో 472 గ్రామ పంచాయతీలకు సొంత భవానాలను నిర్మిస్తే.... మన నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1628 సొంత భవనాలు నిర్మించారు. ఇంకేముంది... సభలో చప్పట్లే.. చపట్లు. ఇక పట్టిసీమ పై చంద్రబాబు రోజూ చేసే ప్రసంగాన్నే తిరిగి చేసినా ప్రతి వాక్యానికి ఏపీ శాసనసభ చపట్లతో దద్దరిల్లిపోయింది. మరోవైపు హోంమంత్రి చినరాజప్ప శాసనసభ్యులకు స్వీట్లు పంచారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రతిపక్షం లేకుండా అన్ని స్థానాలను టీడీపీ గెలవాలని చినరాజప్ప ఆకాంక్షించారు. మొత్తం మీద ఏపీ అసెంబ్లీలో కేకల్లేవు... ఓన్లీ కరతాళ ధ్వనులే.

Similar News