కూత పెద్దగా పెట్టలేదు....

Update: 2017-02-03 15:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాలకు ఈసారి రైల్వే బడ్జెట్ లో నిధుల కేటాయింపు జరిగింది. కొంచెం...ఇష్టం...కొంచెం...కష్టంగా బడ్జెట్ ఉందన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. విశాఖ రైల్వే జోన్ ఊసు లేకుండానే ఈసారి బడ్జెట్ లో మ...మ అని పించారు.

అమరావతికి రైలు కోసం 2,680 కోట్లు...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 4 రైల్వే క్రాసింగ్ లకు 19 కోట్ల రూపాయలను కేటాయించారు. బొల్లారం, ముకుంద్ మధ్య 235 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ సర్వేకు అనుమతిచ్చారు. కాజీపేట - బలార్షా మధ్య నాలుగో లైన్ సర్వే, కాజీపేట -విజయవాడ మధ్య నాలుగో లైన్ సర్వేకు బడ్జెట్ లో ఓకే చెప్పారు. విజయవాడ, అమరావతి, గుంటూరు లైన్ కు 2,680 కోట్ల రూపాయాలను రైల్వే బడ్జెట్ లో కేటాయించడం విశేషం. రాజమండ్రి రైల్వే యార్డు అభివృద్ధి కోసం 27.2 కోట్లు, రాయనపాడు లో షెడ్ నిర్మాణానికి 8.7 కోట్లు, తిరుపతి రైల్వే స్టేషన్లో విశ్రాంతి గది నిర్మాణానికి ఏడు కోట్ల రూపాయలనున కేటాయించారు. మౌలాలి వద్ద ఈఎంయూ కార్ షెడ్ కోసం 5.86 కోట్లు, గూడూరు వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 2.7 కోట్లు, విజయవాడ, గుడివాడ లైన్ మచిలీపట్నం పోర్టు వరకు పొడిగించేందుకు 130 కోట్ల రూపాయలను రైల్వే శాఖ కేటాయించింది. గుంటూరు-తెనాలి రైల్వే లైన్ డబ్లింగ్ కోసం 36 కోట్లు, కాజీపేట్ - విజయవాడ మూడో లైన్ కు వంద కోట్లు, విజయవాడ - గూడూరు మూడో లైన్ కు 100 కోట్లు కేటాయించారు.

తెలంగాణలో కొత్త లైన్లు...

అలాగే హిందూపురం- చిత్రదుర్గ మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు సర్వే చేయాలని నిర్ణయించారు. కొండపల్లి - కిరండోల్ మధ్య నూతన రైల్వే లైన్ కు అనుమతిచ్చారు. మంత్రాలయం - కర్నూలు మధ్య లైన్ నిర్మించేందుకు సర్వే చేస్తారు. విజయవాడ -నిడదవోలు మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం 122 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించారు. సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులకు 50 కోట్లు మంజూరు చేశారు. గుత్తి -ధర్మవరం రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం 75 కోట్లు, పెద్దపల్లి - కరీంనగర్ - నిజామాబాద్ నూతన రైల్వే లైనుకు 25 కోట్ల రూపాయలను రైల్వే బడ్జెట్ లో కేటాయించారు. జగ్గయ్య పేట - మేళ్ల చెరువు - జాన్ పహాడ్ మార్గానికి 79 కోట్లు, మునీరాబాద్ - మహబూబ్ నగర్ రైల్వే లైన్ కు 300 కోట్ల రూపాయలను కేటాయించారు. విజయవాడ - కాజీపేట - రేణిగుంట - గుత్తి బైపాస్ నిర్మాణానికి 135 కోట్లు, కాకినాడ - పిఠాపురం రైల్వే లైనుకు 150 కోట్లు, ఓబులాపురం - కృష్ణపట్నం రైల్వే లైన్ కు 100 కోట్లు , మంచిర్యాల - పెద్దపల్లి మూడో లైన్ కు 100 కోల్ల రూపాయలను కేటాయించింది. యాదాద్రి - ఘట్ కేసర్ ఎంఎంటీస్ రైలు విస్తరణకు 16 కోట్లు కేటాయింపు జరిగింది.

Similar News