కింజరాపు గళం : వట్టిమాటలు కట్టి పెట్టాల్సిందే!

Update: 2016-11-18 06:52 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ విషయంలో.. ఏ హామీలనైతే ఇచ్చారో వాటన్నింటినీ పేపర్ మీద పెట్టాల్సిందేనని, వాటికి చట్టబద్ధత కల్పించాల్సిందేనని పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది. శుక్రవారం నాడు లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన హామీలకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు చట్టబద్ధత కోరుకుంటున్నారనే విషయాన్ని రామ్మోహన్ నాయుడు చాలా స్పష్టంగా, దృఢంగా సభకు వినిపించారు.

విభజన చట్టం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా దక్కాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యేక హోదాను కోరుకున్నారు. కానీ ఆ విషయంలో అవకాశం లేకుండా పోయింది. కేంద్రం సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రెండున్నర నెలల కిందట రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఆరోజు మంత్రి చేసిన ప్రకటన తప్ప.. ఈ రెండున్నర నెలల్లో ప్యాకేజీ విషయంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. అసలు ప్యాకేజీ రూపంలో ఏం ఇవ్వదలచుకున్నారో, ఏయే దశల్లో ఇవ్వదలచుకున్నారో ఆ విషయాలను పేపర్ మీద పెట్టి అధికారికంగా వెలువరించడం కూడా జరగలేదని రామ్మోహన్ నాయుడు నిలదీశారు.

ప్రత్యేక హోదా విషయంలో రెండున్నరేళ్లపాటూ ఏ సంగతి తేల్చకుండా, ఎలాంటి స్పష్టత లేకుండా రోజులు దొర్లించేశారని, ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రెండున్నర నెలలు గడచిపోతున్నా .. ఇప్పటిదాకా దాని అతీగతీ గురించి పట్టించుకోకపోవడం శోచనీయం అంటూ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ప్యాకేజీ విషయంలో కేంద్రం ప్రకటించిన అంశాలను అయిదేళ్ల తర్వాత రాష్ట్రానికి ఇచ్చినా, పదేళ్ల తర్వాత ఇచ్చినా పర్లేదు.. కానీ దానికి ఒక లీగల్ శాంక్టిటీ ఉండాలి.. చట్టబద్ధత ఉండాలి... మీరు ఏం చేయదలచుకున్నారో అదంతా పేపర్ మీద ఉండాలి.. అంటూ రామ్మోహన్ నాయుడు తెదేపా ఎంపీల హర్షధ్వానాల మధ్య డిమాండ్ చేశారు.

అయితే ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత సాధించే అంశం ఇదివరకు కూడా చంద్రబాబునాయుడు నుంచే పలుమార్లు డిమాండ్ ను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా స్పందన మాత్రం లేదు. కనీసం ఇప్పుడు పార్లమెంటు వేదికగా దీనిని ప్రస్తావించిన నేపథ్యంలోనైనా అరుణ్ జైట్లీలో స్పందన వస్తుందేమో చూడాలి.

Similar News