కాంగ్రెస్ కు వ్యూహం లేదు...హోమ్ వర్క్ లేదా?

Update: 2017-11-09 04:30 GMT

తెలంగాణ అసెంబ్లీలో విపక్షాలదే పైచేయి అవుతోంది. సభలో అధికార పార్టీని గట్టిగా డీకొనలేక పోతున్నాయి. సభ బయట చేసిన విమర్శలు లోపల చేయడం లేదన్న విమర్శలు ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచే విన్పిస్తున్నాయి. సభ ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా వాకౌట్లు, నిరసనలు తప్ప ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం కాంగ్రెస్, బీజేపీ చేయలేకపోతుందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే గుసగుసలాడుకుంటున్నారు. సభ ఎన్ని రోజులు నిర్వహిస్తుందో కూడా ప్రభుత్వం చేత ప్రకటన చేయించుకోలేని దుస్థితిలో విపక్షాలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ , బీజేపీలు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ఆరోపణలు బయట చేశాయి. అయితే ఈ అంశంపై సభలో చర్చ జరిగినప్పటికీ రుణ మాఫీ ఎలా ఫెయిల్ అయిందో విపక్షాలు నిరూపించలేకపోయాయ. రుణమాఫీపై స్వల్ప కాలిక చర్చ జరిగిన సందర్భంలో ముఖ్యమంత్రి వడ్డీ పూర్తిగా మాఫీ చేశామని, అందుకు ఆధారాలుంటే నిరూపించాలని సవాల్ విసిరినా ప్రతిపక్షాలు వివరాలు అందించలేకపోయాయి.

అధికార పక్షానికి ధీటుగా.....

ఇక భూ రికార్డుల ప్రక్షాళనపై బయట గందరగోళం చేసిన విపక్షాలు తీరా ఆ అంశం సభలో చర్చకు వచ్చే సమయంలో తోకముడిచినట్లయంది. ప్రభుత్వం ఏం తప్పిదాలు చేసిందో చెప్పలేకపోయాయి. కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క మాత్రం కొన్ని తప్పిదాలను ఎత్తి చూపించే ప్రయత్నాలు చేశారు. కాని దానికి కూడా ముఖ్యమంత్రి నుంచి గాని, సంబంధిత మంత్రి నుంచి గాని సమాధానం రాబట్టలేకపోయాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రికి చెందిన భూమి రికార్డులను కూడా తామే సరిచేశామని కేసీఆర్ చెప్పినా అందుకు ధీటుగా సమాధానం చెప్పలేకపోయారు. కేవలం కాంగ్రెస్, బీజేపీలు వివిధ అంశాలపై చలో అసెంబ్లీ కార్యక్రమంపై పెట్టిన శ్రద్థ అసెంబ్లీలో చూపి ఉంటే బాగుండేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. సరైన హోమ్ వర్క్ లేకపోవడం వల్లనే కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టలేకపోతున్నారని ఆ పార్టీలోనే విమర్శలు విన్పిస్తున్నాయి.

Similar News