కాంగ్రెస్ కు అక్కడ కూడా కష్టమేనా?

Update: 2017-11-07 18:29 GMT

నోట్ల రద్దు జరిగి ఏడాది కావస్తోంది. గత ఏడాది నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లయిన వెయ్యి రూపాయలు, ఐదొందల నోట్లను రద్దు చేశారు. దాని స్థానంలో కొత్త ఐదువందల నోటు, రెండు వేల రూపాయల నోటును తీసుకొచ్చారు. దీనివల్ల నల్ల కుబేరులు బయటకు వస్తారని ప్రభుత్వం చెప్పింది. బ్లాక్ మనీ అంతా వచ్చి పడుతుందని ఊహించారు. అయితే ప్రభుత్వం అనుకున్నదానికి విరుద్థంగా జరగింది. పాత పెద్దనోట్లను అవలీలగా బడాబాబులు మార్చేసుకున్నారు. అయితే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడ్డారు. క్యూలైన్లలో డబ్బులు కోసం గంటలు గంటలు నిరీక్షించారు. దాదాపు మూడు నెలలు ఇదే పరిస్థితి దేశంలో నెలకొంది. దీనిపై విమర్శలు ఎదుర్కొన్న ప్రభుత్వం మొత్తం మీద పెద్దమొత్తంలో నగదును ముద్రించి బ్యాంకులకు పంపడంతో కొంతవరకూ సమస్య తీరింది. అయితే దీనిపై కాంగ్రెస్ నవంబరు 8వ తేదీని బ్లాక్ డేగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలను ధరించి నిరసనలు తెలియజేయాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చింది.

హ్యాండిచ్చిన డీఎంకే...

అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ మిత్ర పక్షాలైన అన్ని పార్టీలూ ఈ బ్లాక్ డేను జరుపుతామని ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అయితే ఏకంగా పశ్చిమ బెంగాల్ లో నవంబర్ 8న బ్లాక్ డేను జరపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఫేస్ బుక్, ట్విటర్ డీపీలను కూడా బ్లాక్ గా మార్చేయమన్నారు మమత. అంత సీరియస్ గా ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు మిత్రపక్షంగా వ్యవహరించే డిఎంకే మాత్రం ఝలక్ ఇచ్చింది. తాము నవంబర్ 8వ తేదీన బ్లాక్ డే జరపడం లేదని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ప్రకటించారు. నిన్న చెన్నైకి వచ్చిన ప్రధాని మోడీ కరుణానిధిని పరామర్శించిన సంగతి తెలిసిందే. అప్పుడే డీఎంకేతో బీజేపీ సఖ్యతగా మెలుగుతుందన్న వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ స్టాలిన్ ప్రకటన చేయడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. రేపటి బ్లాక్ డేను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సీరియస్ గా తీసుకున్నారు. అన్ని రాష్ట్రాల్లోని పార్టీ శాఖలకు బ్లాక్ డేను విజయవంతం చేయాలని ఆదేశించారు. విన్నూత్న తరహాలో నిరసనలు చేయమని పిలుపు నిచ్చారు. కాని ఈ పరిస్థితుల్లో డీఎంకే కాంగ్రెస్ కు హ్యాండ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పెద్దాయనకు మోడీ ఏ మంత్రం వేశారో...!

Similar News