కరీంనగర్ లో కాంగ్రెస్ కు ఇక కష్టాలేనా?

Update: 2017-11-08 09:30 GMT

రేవంత్ ఇచ్చిన షాక్ తో టీఆర్ఎస్ అలెర్ట్ అవుతోంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి వెంట పెద్దయెత్తున టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ముఖ్య నేతలు ఎక్కువ మంది వెళ్లిపోవడంతో ఇప్పుడు టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇక టీఆర్ఎస్ కరీంనగర్ లో బలోపేతం అవుతుందని భావించి అలెర్ట్ అయింది. వెంటనే నేతలు వెళితే వెళ్లనీ... ద్వితీయ శ్రేణి నేతలతో పాటు కాంగ్రెస్, బీజేపీల నుంచి వచ్చేవారికి ఇదే మా ఆహ్వానం అంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీ బోర్డు పెట్టేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ బాధ్యతలను కేసీఆర్ మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ లకు అప్పగించారు. దీంతో వీరు కరీనంగర్ జిల్లాలోని బీజేపీ, కాంగ్రెస్ నేతలపై గురిపెట్టారు. కాంగ్రెస్ నేతలు కొందరు ఈ ఇద్దరు మంత్రులతో టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. దీంతో త్వరలోనే కరీంనగర్ లో గులాబీ పార్టీలో చేరికలు భారీగా ఉంటాయన్న వార్తలొస్తున్నాయి.

ముఖ్య నేతలను చేర్చుకునేందుకు....

టీటీడీపీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిపోవడంతో ఆయనతోపాటు నేతలు, క్యాడర్ భారీ ఎత్తున ఇక్కడ తరలి వెళ్లింది. దీంతో టీఆర్ఎస్ అప్రమత్తమయింది. కరీంనగర్ జిల్లాలో ముఖ్యనేతలకు గులాబీ పార్టీ గురిపెట్టింది. ప్రధానంగా పెద్దపల్లి, మంథని నియోజకవర్గాలపై టీఆర్ఎస్ దృష్టిపెట్టింది. టీడీపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు విజయరమణారావును టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు గతంలోనే అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆయన అనూహ్యంగా రేవంత్ వెంట వెళ్లిపోయారు. విజయరమణారావుకు పెద్దయెత్తున అనుచరగణం ఇక్కడ ఉంది. రమణారావు చేరికతో అసంతృప్తిగా ఉన్న నేతలను తమవైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించి కొంత మేర సక్సెస్ అయింది. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ ను ఆశిస్తున్న ముకుందరెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. విజయరమణారావు చేరికతో వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ దక్కదని భావించిన ముకుందరెడ్డి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇటీవల కలిసి తనకు స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆయన గులాబీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక మంధనినియోజకవర్గంలోనూ మాజీ మంత్రి శ్రీధర్ బాబు ప్రధాన అనుచరుడు కాటారం జడ్పీటీసీ నారాయణరెడ్డికి గులాబీ పార్టీ కండువా కప్పేశారు. ఆయనపై గంజాయి కేసు కూడా శ్రీధర్ బాబు మెడకు చుట్టుకునేలా ఉంది. ఇక మానకొండూరులోనూ కాంగ్రెస్, బీజీపీ, టీడీపీ క్యాడర్ ను చేర్చుకోవాలని నిర్ణయించింది. మొత్తం మీద కరీంనగర్ జిల్లాపై గులాబీ బాస్ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈరోజో, రేపో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు గులాబీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తేలింది.

Similar News