కమల్ కూ ఒక లెక్కుంది...?

Update: 2017-11-07 19:30 GMT

సినీనటుడు కమల్ హాసన్ సాదాసీదాగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం లేదు. ఆయన పక్కా ప్లానింగ్ తోనే పొలిటికల్ పార్టీ పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా ప్రజల సమస్యలను తెలియజేసేందుకు మై యాం యాప్ ను కమల్ హాసన్ విడుదల చేశారు. ఈ యాప్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. యాప్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉందని కమల్ చెప్పారు. అసలు విషయమేంటంటే... తాను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు కమల్ స్పష్టంగా ప్రకటించారు. అయితే ఎప్పుడు ప్రకటిస్తానన్నది తెలియజెప్పలేదు. అందుకోసం ప్రజల్లోకి వస్తానని కమల్ చెబుతున్నారు. త్వరలోనే తమిళనాడు మొత్తం పర్యటించేందుకు కమల్ రెడీ అవుతున్నారు.

రాష్ట్ర మంతటా పర్యటించిన తర్వాతే....

తొలుత రాష్ట్ర మంతటా పర్యటించి, ప్రజలను కలుసుకుని, వారిసమస్యలను ఓపిగ్గా విని... వారు కోరకుంటేనే పార్టీని ప్రకటిస్తానని కమల్ చెబుతున్నారు. ప్రజల మద్దతు ఉంటేనే పార్టీ ఉంటుందని ఆయన తెలిపారు. అందుకోసమే పీపుల్స్ పల్స్ తెలుసుకునేందుకు కమల్ తమిళనాడు మొత్తం పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అయితే తాను రాజకీయాల్లోకి వచ్చేసినట్లేనని కమల్ చెప్పేశారు. అయితే పార్టీ ఒక వ్యక్తి ఏర్పాటు చేయాలంటే దానికి ఎంతో నిర్మాణం అవసరమన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అండ ఉండాలన్నారు. అందుకోసమే తాను పార్టీనిర్మాణంపై గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని చెప్పారు. అభిమానులందరూ సామాజిక సేవ ద్వారా ప్రజలకు చేరువవ్వాలని పిలుపునిచ్చారు. కమల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కూడా వివరణ ఇచ్చారు. తాను హిందువునేనని, తాను హిందువుల మనోభావాలను కించపర్చాలనుకోలేదని తెలిపారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పారు. మొత్తం మీద కమల్ భారీ స్థాయిలోనే ఒంటరిగా ఎన్నికల బరిలోకి నిలిచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కమల్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.

Similar News