కడప నేతకు ఝలక్ ఇచ్చిన చంద్రబాబు

Update: 2017-11-11 12:30 GMT

జమ్మలమడుగు టీడీపీనేత రామసుబ్బారెడ్డికి చంద్రబాబు షాకిచ్చారు. ఆయనను మండలి చీఫ్ విప్ పదవికి ఎంపిక చేస్తారని అందరూ భావించారు. అయితే చంద్రబాబు ఊహించని విధంగా పయ్యావుల కేశవ్ ను ఈ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పయ్యావుల కేశవ్ సీనియర్ నేత. ఆయన కూడా గతంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పదవి వస్తుందని ఆశించారు. అయినా సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో పయ్యావుల కేశవ్ ను చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకోలేక పోయారు. దీంతో పయ్యావుల గత కొంత కాలంగా అసంతృప్తితోనే ఉంటూ వస్తున్నారు. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి గట్టిగా గళం విప్పిన నేతల్లో పయ్యావుల ఒకరు. అయితే ఇటీవల అనంతపురం జిల్లాకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏకాంతంగా మాట్లాడటంతో పయ్యావుల కేశవ్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయనను చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అయినా నంద్యాల ఉప ఎన్నికలో కీలకపాత్ర పోషించిన పయ్యావులకు ఈ పదవి కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

అసంతృప్తిలో రామసుబ్బారెడ్డి వర్గం....

అయితే పయ్యావులకు మండలిలో చీఫ్ విప్ పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రామసుబ్బారెడ్డి తొలి నుంచి తనకు కేబినెట్ హోదా పదవి కావాలని కోరుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఇస్తే సరిపోదని కూడా అధినేతకు ఆయన గతంలోనే చెప్పారు. శాసనమండలి స్పీకర్ గా ఎన్ఎండీ ఫరూక్ ను నిర్ణయించడంతో చీఫ్ విప్ పదవి అయినా దక్కుతుందని రామసుబ్బారెడ్డి ఆశలు పెట్టుకున్నారు. కాని శాసనసభలో పల్లె రఘునాధరెడ్డిని చీఫ్ విప్ గా ఎంపిక చేయాలని నిర్ణయించడంతో ఒకే సామాజిక వర్గానికి రెండు పదవులు ఇచ్చినట్లవుతుందని, పయ్యావులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద శాసనసభ, శాసనమండలి చీఫ్ విప్ లు ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన వారు కావడం విశేషం. పయ్యావులను, పల్లెను ఇద్దరిని చంద్రబాబు అమరావతికి పిలిపించుకుని మాట్లాడారు. అందరితో సమన్వయంతో మెలగాలని సూచించారు. ఇక రామసుబ్బారెడ్డికి మండలిలో విప్ పదవి ఇచ్చే అవకాశముందంటున్నారు. తన నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకుని మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా, పార్టీ కోసం జైలుకు కూడా వెళ్లి వచ్చిన తనకు ముఖ్యమైన పదవి ఇవ్వకపోవడమేంటని రామసుబ్బారెడ్డి తీవ్రంగా కలత చెందుతున్నారు. మరి రానున్న రోజుల్లో జమ్మల మడుగు రాజకీయాలు ఎలా మారనున్నాయో వేచి చూడాల్సిందే.

Similar News