ఐదేళ్లలో వేల కోట్లు ఎలా సంపాదించాడో...

Update: 2017-02-18 09:00 GMT

మల్టీ లెవల్ మార్కెటింగ్‌లో కొత్త తరహా మోసం ఆన్‌లైన్‌ క్లిక్స్‌ గుర్తుందిగా..., ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 3700 కోట్ల స్కాం అది. దాదాపు ఆరున్నర లక్షల మందికి టోపీ పెట్టి మరీ సంపాదించిన సొమ్ము., ఆన్‌లైన్‌ క్లిక్కులకు లెక్కుంటుంది వాటితో లక్షలు మూటగట్టొచ్చు అంటూ జనాల్ని బొల్తా కొట్టించిన మాయగాడి విశేషాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. లెక్కల్లో తిరుగులేని ప్రావీణ్యం ఉన్న అభినవ్ మిట్టల్ అనే వ్యక్తి నాలుగున్నరేళ్లలో వేల కోట్లు కొట్టేశాడు. ఎలాగైనా ఐఐటీలో చదవాలనుకున్న మిట్టల్.. కెమిస్ట్రీలో తగినన్ని మార్కులు రాకపోవడంతో ఆ ఛాన్సు పోగొట్టుకున్నాడు. తర్వాత గ్రేటర్ నోయిడాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజిలో చదివేటప్పుడే అతనికి ఈ లైకుల స్కీం ఆలోచన వచ్చింది. తన హాస్టల్ గదినే మొట్టమొదటి ఆఫీసుగా చేసుకుని ఫేస్‌బుక్ లైకుల స్కాంకు తెరతీశాడు. మల్టీలెవెల్ మార్కెటింగ్ బిజినెస్ ప్రారంభించాలని తలపెట్టి, తన సొంత కంపెనీ ఒకదాన్ని ప్రారంభించాడు. మొదట్లో దీన్నుంచి మరీ అంత ఎక్కువ డబ్బు రాకపోవడంతో అతడి జీవనశైలి కూడా మామూలుగానే ఉండేది. అయితే, అది చాలదనుకుని.. తన కంపెనీని ఇంకా బాగా విస్తరించాడు. సహోధ్యాయులు ఇద్దరిని కలుపుకుని ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ మొదలుపెట్టాడు. సోషల్ ట్రేడ్ అంటూ వ్యాపారం పేరుతో కుచ్చుటోపి పెట్టాడు. 2015లో సోషల్‌ట్రేడ్.బిజ్ అనే పేరుతో ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభించి దానిని క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాడు. ఆ తర్వాత లైకులతో వ్యాపారం చేయొచ్చని భావించాడు. ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. వెంటనే ప్రారంభించేశాడు. అయితే అసలు తాను పట్టుబడతానన్న ఆలోచన కూడా అతడికి ఏ క్షణంలోనూ రాలేదు. తన వ్యాపారం సక్సెస్ అవుతుందనుకున్నాడే గానీ, అందులోని చట్టపరమైన అంశాలు తెలుసుకోలేదు.

లగ్జరీ లైఫ్ కు అలవాటుపడి...

నిజానికి 2015 వరకు అతడు సాధారణ జీవితాన్నే గడిపాడు. అయితే ఆ తర్వాతి నుంచి ఒక్కసారిగా సంపద పెరిగిపోయింది. దాంతో ఆడి లాంటి అనేక లగ్జరీ సెడాన్ కార్లు కొనేపశాడు. గ్రేటర్ నోయిడాలో విలాసవంతమైన విల్లా కొన్నాడు. ఢిల్లీలోని కనాట్‌ప్లేస్ లాంటి హాట్ కమర్షియల్ ప్రాంతంలో రూ. 7 కోట్ల విలువైన షాపు ఉంది. ఇంకా బ్యాంకు అకౌంట్లలో ఎంత మొత్తం దాచాడు, ఇతర పెట్టుబడులు ఏంటోనని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సన్నీ లియోన్, అమిషా పటేల్ లాంటి వాళ్లతో కూడా కలిసి మిట్టల్ ఫొటోలు దిగాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపించాయి. వాటిని కూడా మిట్టల్ తన వ్యాపారాన్ని విస్తరించుకోడానికే ఉపయోగించాడు. ఈ మొత్తం చేయడానికి అతడికి పట్టిన సమయం కేవలం ఐదేళ్లు మాత్రమే. ఏపీతో సహా అన్ని రాష్ట్రాల్లో ఇతని మాయలో పడి లక్షలు పోగొట్టుకున్న వాళ్లు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.

Similar News