ఎయిర్‌ బస్సేగా.... నిలబడితే తప్పేంటి....?

Update: 2017-02-26 18:00 GMT

పాక్‌ విమానంలో నిలబడి ప్రయాణం

ఏడుగురిని అదనంగా తీసుకెళ్లిన పాక్‌ ఎయిర్‌లైన్స్‌

బస్సు కాకుంటే ఇది కూడా ఎయిర్‌ బస్సే కదా అనుకున్నారో ఏమో కాని పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌ లైన్స్‌ సిబ్బంది ఓ ఏడుగురు ప్రయాణికుల్ని అదనంగా నిలబెట్టి పంపేశారు. సీట్ల సామర్ధ్యానికి సరిపడా ప్రయాణికులు ఎక్కిన తర్వాత అదనంగా మరో ఏడుగురిని ఫ్లైట్‌ ఎక్కించేశారు. విమానంలో ఎక్కిన వారిని ఓ పక్కగా నిలబెట్టి కరాచీ నుంచి సౌదీ అరేబియాలోని మదీనాకు తరలించింది. జనవరి 20న జరిగిన ఈ ఘటన.. పాక్‌ పత్రిక డాన్‌ కథనంతో వెలుగులోకి వచ్చింది. 409 మంది పట్టే బోయింగ్‌-777 విమానంలో 416 మంది ప్రయాణించినట్లు డాన్‌ తెలిపింది. లిఖితపూర్వక బోర్డింగ్‌ పాసులు ఇచ్చి.. సిబ్బందే అందరినీ దగ్గరుండి విమానం ఎక్కించినట్లు ఆ పత్రిక పేర్కొంది. అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించామని పీఐఏ అధికార ప్రతినిధి డేనియేల్‌ గిలానీ తెలిపారు. మరోవైపు అదనపు ప్రయాణికులపై తనకు ముందుగా తెలియదని విమానం కెప్టెన్‌ అన్వర్‌ దిల్‌ పేర్కొన్నారు. ‘విమానం పైకి ఎగిరిన తర్వాతే నాకు సంగతి తెలిసింది.ఎయిర్‌ ట్రాఫిక్‌ సిబ్బంది కొందరిని అదనంగా ఎక్కించినట్లు సీనియర్‌ అధికారి ఒకరు నాకు తెలియజేశారు. ఆ సమయంలో వెనక్కి వస్తే.. బోలెడంత ఇంధనం వృథా అవుతుంది. అందుకే అందరినీ మదీనా తీసుకుపోయా’అని దిల్‌ వివరించారు. ఈ ఘటనపై వైమానిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే.. అదనపు ప్రయాణికులకు ఆక్సిజన్‌ బ్యాగ్‌లు ఎక్కడి నుంచి తీసుకొస్తారని వారు ప్రశ్నలు సంధించారు. పాక్‌ పౌరవిమానయాన శాఖ మాత్రం పెదవి విప్పడం లేదు.

Similar News