ఎమ్మెల్యేలు ఒక్కటయ్యే సరికి చంద్రబాబు వెనక్కు తగ్గారా?

Update: 2016-11-22 06:35 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను తీసుకున్న నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గడానికి సిద్ధపడ్డారా? తెలుగు సినీ రంగాన్ని విశాఖకు తీసుకువచ్చే కృషిలో భాగంగా విశాఖపట్టణంలో తొట్ల కొండ మీద చేసిన భూ కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేయబోతోందా? ఏమో.. మంత్రిగారి మాటలు వింటే అలాగే అనిపిస్తోంది గానీ.. అదే జరిగితే, స్థానిక ఎమ్మెల్యేలు అందరూ ఐక్యంగా ఒక్కటై తెచ్చిన ఒత్తిడికి సీఎం చంద్రబాబు తలొగ్గి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా భావించాల్సి వస్తుంది.

తెలుగు సినీ రంగాన్ని ఏపీలో కూడా ఏదో ఒక చోట కేంద్రీకరింపజేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా.. విశాఖపట్టణంలోని తొట్లకొండ ను ఫిలిం క్లబ్ నిర్మాణానికి కేటాయించారు. విశాఖ పట్నానికే చెందిన ఒక మంత్రి తెర వెనుక ఉండి సినీ పరిశ్రమ వచ్చేస్తుందని అంటూ... ఈ ఫిలింక్లబ్ కు స్థల కేటాయింపులో కీలక పాత్ర పోషించినట్లు గుసగుసలు ఉన్నాయి.

అయితే స్థానికంగా విశాఖలోని ఎమ్మెల్యేలు అందరూ కట్టుగా దీనిని వ్యతిరేకించారు. తొట్ల కొండ భూ కేటాయింపును రద్దు చేయాల్సిందేనంటూ.. అందరూ కలసి కట్టుగా మీటింగులు పెట్టుకుని తీర్మానాలు కూడా చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే గ్రూపు కట్టడంపై చంద్రబాబు ఆగ్రహించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా తొట్ల కొండ భూ కేటాయింపులు రద్దయిపోతున్నట్లు విశాఖకు చెందిన మరో మంత్రి అయ్యన్న పాత్రుడు అంటున్నారు. స్థానిక ప్రజల అభ్యంతరాలు, బౌద్ధుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, ఈ తొట్లకొండను ఫిలింక్లబ్ కు ఇవ్వాలనే జీవోను రద్దు చేయడానికి ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్లుగా అయ్యన్న చెబుతున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు గానీ.. అదే జరిగితే.. విశాఖ జిల్లాలో మంత్రుల మధ్య ఉన్న విభేదాలకు తొట్లకొండ ఎపిసోడ్ పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కలసికట్టుగా చేసిన ఒత్తిడికి సీఎం తలొగ్గినట్లు అనిపిస్తుంది.

Similar News