ఎంపీల గొంతెమ్మ కోర్కెలు బుట్ట దాఖలే

Update: 2016-09-29 01:35 GMT

ప్రజా సమస్యల విషయంలో ఎంత మాత్రం స్పందిస్తున్నారనేది ఒక్కొక్క ఎంపీ విషయంలో విడివిడిగా ఉంటుంది గానీ.. తమకు తాము మరిన్ని వసతులు కల్పించుకోవడంలో, తమ కోర్కెలు తీర్చుకోవడంలో మాత్రం ఎంపీలకు చాలా ఆశలున్నాయి. అందరూ కలసి కట్టుగానే పోరాడుతున్నారు. మన దేశంలో ఎంపీలు ఇప్పుడు ప్రత్యేకంగా తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. జీతాల సంగతి అటుండగా, విమాన సర్వీసుల్లో తమకు ఫలానా ఫలానా అదనపు సదుపాయాలు కావాలంటూ.. ఎంపీల ప్రాతినిధ్యంతో పార్లమెంటరీ బ్రుందం ఓ కోర్కెల జాబితాను తీసుకెళితే.. ప్రెవేటు ఎయిర్ లైన్ ఆపరేటర్లు దాన్ని బుట్ట దాఖలు చేశారు. మీకు ఇప్పుడిస్తున్న సదుపాయాలే.. కొత్తగా కోరికలకు అనుమతి లేదు అంటూ దాదాపు తెగేసి చెప్పడం విశేషం.

ఎంపీలకు విమాన సర్వీసుల్లో ప్రయాణ టికెట్ల రాయితీలు వంటి సదుపాయాలు అనేకం ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన సంగతే. కాకపోతే.. మన ఎంపీలు మళ్లీ సరికొత్త డిమాండ్ల జాబితా తయారుచేశారు. చివరి నిమిషంలో టికెట్ లు బుక్ చేసుకున్నా.. డిస్కౌంట్లు ఇవ్వాల్సిందేని, తమకు అమ్మే టికెట్లను తక్కువ ధరకు ఇవ్వాలని, సీట్లలో తమకు కోటా ఉండాలని, ఎయిర్ పోర్ట్ లలో తమకు ప్రత్యే క ఏర్పాట్లుండాలని, తాము చివరి నిమిషంలో వచ్చినా తనిఖీల్లో తక్కువగా ఉండాలని, చివరికి తమకు ఆహారం కూడా ఉచితంగా పెట్టాలని ఇలాంటి కోరికలు కోరారు.

ఒక పరిమితి వరకు ఇలాంటి సదుపాయాలు వారికి ఇప్పటికే ఉన్నాయి. అయితే ఎంపీలు మరీ గొంతెమ్మ కోరికలకు వెళ్లడంతో.. ప్రెవేటు ఎయిర్ లైనర్లు అందుకు తూచ్ అన్నాయి. ఇలాంటివి తీర్చడం తమ వల్ల కాదన్నాయి. అయినా ఇంతోటి శ్రద్ధను మన నాయకులు ప్రజలకు సౌకర్యాలు కల్పించడంపై చూపించగలిగితే ఎంత బాగుంటుందో కదా? అని పలువురు భావిస్తున్నారు.

Similar News