ఊబర్ క్యాబ్ తో విడాకుల వరకూ....

Update: 2017-02-13 16:49 GMT

ప్రముఖ క్యాబ్ సర్వీస్‌ సంస్థ సాంకేతికంగా చేసిన పొరపాటు ఓ వ్యక్తి కుటుంబంలో చిచ్చుకు కారణమైంది. షికారుకు వెళ్లేందుకు భార్య ఫోన్ నుంచి ఓసారి క్యాబ్ బుక్ చేయడం అతనికి శాపంగా మారింది. చివరకు అది కాస్తా విడాకులకు దారితీసిందని ఫ్రెంచి వ్యాపారవేత్త లబోదిబో మంటున్నాడు. ఇందుకు ఉబర్ క్యాబ్ సంస్థ కారణమైనందున తనకు నష్టపరిహారంగా 40 మిలియన్ పౌండ్లు నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో దావా వేశాడు. ఈ మొత్తం భారత కరెన్సీలో దాదాపు 335 కోట్ల రుపాయలు ఉంటుంది. దక్షిణ ఫ్రాన్స్ లోని కోట్ డీ అజర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఓరోజు షికారుకు వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. భార్య మొబైల్ లో ఉన్న యాప్‌తో కారు బుక్‌ చేసుకుని ఓ ఈవెంట్ కి వెళ్లారు. ఆ తర్వాత భార్య మొబైల్ నెంబర్ నుంచి లాగ్ ఔట్ అయిపోయాడు.

భార్య మొబైల్ కు అప్ డేట్స్..

అది మొదలు ఆ వ్యాపారవేత్త ఎప్పుడు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నా..,అతని భార్య మొబైల్‌కు అప్ డేట్స్ వెళ్లేవి. కొన్ని రోజుల వరకు భార్య ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ బిజినెస్ పని ఉందంటూ భర్త తరచుగా కొన్ని ప్రదేశాలకు వెళ్తున్నాడని గ్రహించింది. ఇది ఇద్దరి మధ్య స్పర్ధలకు కారణమైంది. ఉబర్ క్యాబ్ అప్లికేషన్ సాంకేతిక లోపం వల్ల భార్య తనను అనుమానిస్తోందని అతను ఆరోపించాడు. చివరికి ఇద్దరి మధ్య గొడవలతో అంతరం పెరిగిపోయి తన భార్య విడాకులు ఇచ్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన పరువు పోయిందని, ఇందుకు కారణమైన ఉబెర్ సంస్థ తనకు 335 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆ వ్యాపారవేత్త కోర్టుకెక్కాడు. తొలిసారి లాగిన్ డాటాతో తాను ఎక్కడ యాప్ వాడినా తన భార్య మొబైల్‌కు మెస్సేజ్ వెళ్లడమే తమ మధ్య గొడవలకు కారణమైందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉబర్ మాత్రం ఈ విషయంపై ఏ విధంగానూ స్పందించలేదు. సాంకేతిక లోపం నిజమైతే ఉబర్‌ భారీ జరిమానా చెల్లించాల్సి రావొచ్చు.

Similar News