ఉత్తరాంధ్రలో టీడీపీ తెలివి చూడరూ...

Update: 2017-02-17 04:00 GMT

ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరలేచింది. అందులో ముఖ్యంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం అధికారపార్టీకి సవాల్ గా మారింది. అందుకే టీడీపీ ముందు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా గెలవాలని అధికార టీడీపీ భావిస్తోంది. అయితే ఉత్తరాంధ్రలో అధికార పార్టీకి కొంత వ్యతిరేకత కన్పిస్తోంది. దీంతో ఆ నియోజకవర్గాన్ని మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

హామీలన్నీ...కాగితాలపైనే...

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు బీజేపీ, టీడీపీలకు అగ్నిపరీక్షే. ఎందుకంటే ఉత్తరాంధ్రుల చిరకాల వాంఛ అయిన రైల్వే జోన్ కేవలం ప్రకటనకే పరిమితమైంది. మొన్నటి బడ్జెట్ లో కూడా దీనికి చోటు దక్కకపోవడంతో ఆ ప్రాంత ప్రజల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఇప్పటికే రైల్వే జోన్ కావాలంటూ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. దీంతో పాటుగా ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అన్నది మాటల్లోనే వినాల్సి వస్తోందంటున్నారు ఈ ప్రాంత ప్రజలు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి మూడేళ్లవుతున్నా ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోలేదంటున్నారు. జిల్లాకు యాభై కోట్లు ఖర్చు పెట్టామంటున్నా...అవి ఎక్కడా కన్పించడం లేదని చెబుతున్నారు. మరోవైపు విశాఖ తీరంగా సాగిన ప్రత్యేక హోదా ఉద్యమం. ప్రత్యేక హోదాపట్ల ముఖ్యంగా పట్టభద్రుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మూడేళ్లవుతున్నా యువతకు ఉద్యోగాలు లేకపోవడం, ప్రత్యేక ప్యాకేజీతో అధికారపార్టీ సరిపెట్టుకోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. అందుకే టీడీపీ మిత్రపక్షమైన బీజేపీకి ఈ సీటు ఇచ్చి చేతులు దులుపుకుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అయితే ఇక్కడ వామపక్ష పార్టీలు తమ అభ్యర్థిని నిలబెడుతున్నాయి. మొత్తం మీద ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక అధికారపార్టీకి కంటిమీద కునుకులేకుండా చేస్తుందని చెప్పొచ్చు.

Similar News