ఈరోజు జగన్ ఎలాగంటే...?

Update: 2017-11-07 00:30 GMT

వైఎస్ జగన్ పాదయాత్ర నేడు రెండోరోజు సాగనుంది. మొదటి రోజు దాదాపు పది కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ వేంపల్లి వద్ద రాత్రి బస చేశారు. జగన్ వెంట తొలిరోజు వేల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. దీంతో పాదయాత్ర నెమ్మదిగా సాగింది. అడుగడుగునా జగన్ తో ఫొటోలు దిగేందుకు, పలకరించేందుకు అభిమానులు పోటీ పడుతుండటంతో జగన్ సెక్యూరిటీ సయితం ఆందోళన వ్యక్తం చేశారు. సెక్యూరిటీని సయితం తోసుకుని జగన్ వద్దకు వచ్చేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. దీంతో నేటి నుంచి రోప్ వే ఏర్పాటు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

వేంపల్లి నుంచి ప్రారంభమై.....

రెండో రోజు పాదయాత్ర వేంపల్లి నుంచి ప్రారంభమవుతుంది. పులివెందులలోని వేంపల్లి రోడ్డు నుంచి పఉదయం 8.30గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్ర వేంపల్లి క్రాస్ రోడ్డు, శ్రీనివాస కల్యాణమండపం, వేంపల్లి బైపాస్ రోడ్డు, వైఎస్ కాలనీ మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు కదప -పులివెందుల బైపాస్ రోడ్డు లో ఉన్న ప్రొద్దుటూరు క్రాస్ రోడ్డుకు చేరుకుంటుంది. అక్కడ జగన్ భోజన విరామసమయానికి ఆగుతారు. తిరిగి యాత్ర మధ్యాహ్నం 3.30గంటలకు ప్రారంభమై కమలాపురం నియోజకవర్గంలోని సర్వరాజపేట, గాలేరి-నగిరి కెనాల్ మీదుగా వేంపల్లి -ప్రొద్దుటూరు క్యాంప్ సైట్ కు చేరుకుంటుంది. జగన్ రాత్రికి నీలతిమ్మాయపల్లి గ్రామంలో బస చేస్తారు. తొలిరోజు మధ్యాహ్న భోజనానికి దాదాపు యాభై వేల మంది కార్యకర్తలు హాజరయ్యారు. రెండో రోజు కూడా అంతే మంది వస్తారని భావించి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు. జగన్ తొలిరోజు యాత్రలో గుండెపోటు తో వెంకట రమణ అనే కార్యకర్త మరణించారు. దీంతో తొక్కిసలాటలు వంటివి జరగకుండా రెండోరోజు పోలీసులు, వైసీపీ నేతలుపకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News