ఈ రాష్ట్రం కమలానిదేనట...!

Update: 2017-11-06 17:30 GMT

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ముందస్తు సర్వేలు వెల్లడిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఈ నెల 9వ తేదీన జరగనున్నాయి. పోలింగ్ కు ఇంకా మూడు రోజులు సమయం ఉండగానే పీపుల్స్ పల్స్ అనే సంస్థ రాష్ట్రంలో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీజేపీకి 40 స్థానాలు, కాంగ్రెస్ కు 20 స్థానాలు వస్తాయని తేలింది. మిగిలిన స్థానాలను ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తారని ఈ సర్వేలో తేలింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలున్నాయి. మొత్తం 49 లక్షల మంది ఓటర్లున్నారు. ఈ నెల 9వ తేదీ పోలింగ్ కోసం మొత్తం 7500 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల కమిషన్ అధికారులు. పదమూడోసారి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నాయి.

పీపుల్స్ పల్స్ సర్వేలో....

అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను ఎదుర్కొంటుందని సర్వేలో తేలింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఆయన సీబీఐ కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. కాని కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వీరభద్రసింగ్ ను మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఆయనకే అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అప్పగించింది. మరోవైపు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ ను ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ 28 స్థానాలే దక్కాయి. 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాత్రం నాలుగు పార్లమెంటు స్థానాలను బీజేపీ దక్కించుకుంది. సిమ్లా నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ గెలుపొందింది. అయితే కాంగ్రెస్ మాత్రం జీఎస్టీ, నోట్ల రద్దుపై ఆశలు పెట్టుకుంది. కాని తాజాగా పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ 20 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీకి మాత్రం 40 స్థానాల సంపూర్ణమెజారిటీ లభిస్తుందని సర్వేలో తేలింది. మరి ప్రజల మూడ్ ఎలా ఉందో...?

Similar News