ఈ రాయితీలు ప్రగతి సోపానాలు అవుతాయా?

Update: 2016-10-01 00:21 GMT

ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రావడం అసాధ్యం అని తేలిపోయింది. ప్యాకేజీ మాత్రమే ఖరారు. అయితే హోదా లేకపోవడం వల్ల పారిశ్రామికీకరణ వేగంగా జరగదని ఆరోపిస్తున్న వారికి కేంద్రం ఓ జవాబు చెప్పదలచుకున్నట్లుంది. ప్యాకేజీలో భాగంగానే ప్రకటించినట్లుగా, రాయలసీమ ఉత్తరాంధ్రల్లో కంపెనీలు పెట్టే వారికి కొత్తగా పన్ను రాయితీల వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు వచ్చాయి.

ఈ రెండు ప్రాంతాలు బాగా వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాలకు రాయితీల గురించి చాలా కాలంగా చర్చ సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను , ఇతర రాయితీలకు అదనంగా మరో 15 శాతం పన్ను రాయితీ ఇస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలో ఈ రాయతీలకు అర్హమవుతాయి.

2015 ఏప్రిల్‌ 1 నుంచి 2020 మార్చి 31 మధ్య తయారీ రంగంలో ఎవరు ఎలాంటి పరిశ్రమలు పెట్టినా.. అందుకు ఉపయోగించే ప్లాంట్‌ మిషనరీ కోసం చేసిన ఖర్చుపై 15 శాతం అదనపు తరుగుదల రాయితీ, 15 శాతం అదనపు పెట్టుబడి రాయితీ కొత్తగా కల్పించారు. నిజానికి ఇవి ప్రత్యేకహోదాలో భాగంగా ఉన్న అంశాలే. హోదా ఇవ్వడం లేడు గనుక.. నేరుగా ఈ రాయితీలను ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ రాయితీల వల్ల.. బాగా వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ వేగం పుంజుకుంటుందా..? ఉత్పాదక రంగానికి కల్పతరువులా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో.. ఆ మెరుగైన అవకాశాలు.. ఈ వెనుకబడ్డ ప్రాంతాలకు వరాలుగా మారుతాయా లేదా అనేది వేచిచూడాలి.

Similar News