ఇద్దరినీ వదలనంటున్న నాని!

Update: 2016-04-02 23:30 GMT

తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలోనే కొనసాగుతానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. ఈ రోజు విజయవాడలోని ఎన్టీఆర్‌ వెటర్నరీ సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఆయన అక్కడ మాట్లాడారు. అయితే… ఈ కార్యక్రమానికి ఆయన రావడం… అది కూడా హరికృష్ణతోకలిసి రావడం రాజకీయ చర్చలకు దారితీసింది.

అయితే ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన అసలు విషయం చెప్పుకొచ్చారు. తన ఆరాధ్య దైవం దివంగత నందమూరి తారకరామారావు పేరిట ఆసుపత్రి ప్రారంభోత్సవమని తెలిసిన కారణంగానే ఈ కార్యక్రమానికి హాజరయ్యానని ఆయన పేర్కొన్నారు. అంతేకాక ఈ ఆసుపత్రికి తన గురువు నందమూరి హరికృష్ణ నిధులిచ్చారని, అందుకే ఆయనతో కలిసి వచ్చానని తెలిపారు. ఎన్ని పార్టీలు మారినా, తనకు హరికృష్ణే గురువని కూడా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే కలిసి నడుస్తానని కూడా ఆయన ప్రకటించారు. తన రాజకీయ జీవితమంతా జగన్ తోనే సాగుతుందని కూడా కొడాలి నాని స్పష్టం చేశారు. దీంతో చాలావరకు చర్చలకు తెరపడింది.

కాగా ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావుతో కూడా కొడాలి నాని అక్కడ సంభాషించారు. అనంతరం కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాశ్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను కూడా హరికృష్ణ వచ్చినట్లు తెలుసుకుని ఆయన్ను కలిసేందుకే వచ్చానని అవినాశ్ చెప్పారు.

Similar News