ఇదెక్కడి స్వామిభక్తి : గ్రామానికి కవిత పేరు!

Update: 2016-11-28 01:57 GMT

అధినేతను ప్రసన్నం చేసుకుంటే ఏదో ఒక రకంగా లబ్ధి పొందవచ్చుననే ఆశ పార్టీలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాకపోతే.. ఎవరి స్థాయిని బట్టి, వారికి గల అవకాశాల్ని బట్టి అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి వారికి ఒక్కొక్క రకం మార్గాలుంటాయి. అయితే నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన పాలకవర్గం మాత్రం చాలా వెరైటీ మార్గాన్ని అనుసరించింది. తమ పల్లె పేరును మార్చేసి.. నిజామాబాద్ ఎంపీ , తెలంగాణ జాగృతి సారథి ‘కవిత’ పేరును గ్రామానికి పెట్టుకున్నారు. ఖానాపూర్ అనే పేరున్న పల్లెను కాస్తా ‘కవితాపూర్’ గా మార్చేస్తున్నట్లు తీర్మానించేశారు.

కేసీఆర్ ను ప్రసన్నం చేసుకుంటే రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని అందరూ ఆశపడతారు. కాకపోతే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ఈ విచిత్రమైన ఆలోచన వచ్చింది. కేసీఆర్ తనయ కవిత పేరును తమ పల్లెకు పెట్టుకున్నారు. డిసెంబరు నాలుగో తేదీన ఈ పేరు మార్పునకు సంబంధించిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు కూడా వీరు ప్రకటించారు. గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, ఉపసర్పంచి ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.

అయినా ఇదేం పోకడో అర్థం కాని సంగతి. కవితాపూర్ స్ఫూర్తితో తెలంగాణ వ్యాప్తంగా మరికొన్ని వందల కవితాపూర్ గ్రామాలు, తారకరామాపూర్ లు వెలసినా ఆశ్చర్యం లేదేమో.

Similar News