ఇక నటరాజన్ వంతు....

Update: 2017-02-20 20:30 GMT

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కటకటాల పాలైన చిన్నమ్మ శశికళ వర్గానికి మరో షాక్‌తగలనుంది. 1994లో కారు దిగుమతి చేసుకుని పన్ను ఎగ్గొట్టారన్న ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించిన విచారణ మద్రాస్‌ హైకోర్టులో వేగం పుంజుకుంది. ఈ నెల 27న తుదివిచారణకు రానుంది. 1994లో ఖరీదైన లెక్సస్‌ కారు దిగుమతికి సంబంధించిన కేసు ఇది. 1993లో వాడిన కారునే తాము దిగుమతి చేసుకున్నామని చెప్పి దాదాపు కోటి రూపాయల వరకు ఖజానాకు నటరాజన్‌ పన్ను ఎగ్గొట్టారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై అప్పట్లో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నటరాజన్‌తో పాటు మరో ముగ్గురిపై వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. గతంలోనే ఆర్థిక నేరాల కోర్టు నటరాజన్‌ను దోషిగా తేల్చింది. అయితే, దీనిపై ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు ఐదేళ్లుగా కోర్టులో ఈ వ్యవహారం నడుస్తోంది. కేసు వేగవంతం చేయాలని సీబీఐ కోర్టుకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27న ఈ కేసు తుది విచారణ జరగనుంది. మరోవైపు ఇటీవల అన్నాడీఎంకే పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితుడైన శశికళ అక్క కుమారుడు దినకరన్‌పై ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయాలని ఆర్థిక నేరాల కోర్టు లేఖలు రాసింది. దీంతో ఈ రెండు తీర్పులు త్వరలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Similar News