ఇంజినీరింగ్ చదివి...కానిస్టేబుల్ ఉద్యోగాలకు

Update: 2017-01-04 09:40 GMT

తెలంగాణలో ఉన్నన్ని ఇంజినీరింగ్ కళాశాలలు దేశంలో ఎక్కడా లేవని సీఎం కేసీఆర్ అన్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పై అసెంబ్లీలో జరిగిన చర్చ లో సీఎం మాట్లాడుతూ నాణ్యత లేని ఇంజినీరింగ్ కళాశాలలను తెరిచి ఉంచడం కన్నా మూసివేయడమే మేలన్నారు. విజిలెన్స్ తనిఖీలతో మంచి ఫలితాలు సాధించామన్నానరు. అయినా ప్రభుత్వం ఏ ఇంజినీరింగ్ కళాశాలను మూసి వేయలేదని యాజమాన్యాలే విద్యార్థులు లేక మూసివేసుకున్నారన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు కానిస్టేబుళ్ల పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ ప్రభుత్వానికి భారం కాదని, ప్రతి ఏటా ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయీలు చెల్లిస్తూనే ఉన్నామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో బీఈడీ కళాశాలలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వస్తుందా? అని ఒకింత విసుగుతో ప్రశ్నించారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకానికి ఏటా 2500 కోట్లు అవసరమని, ఈ ఏడాది ఇప్పటికే 1400 కోట్లు చెల్లించామని చెప్పారు.

అయితే దీనిపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం ఇప్పటి వరకూ ప్రభుత్వం కళాశాలల యాజమాన్యానికి 4,410 కోట్ల బకాయీ ఉందని, ఆ మొత్తాన్ని ఎప్పడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పేద, దళిత విద్యార్థులు చదువు కునేందుకు ఇబ్బంది పడుతున్నారన్నారు.

Similar News