ఆరంభం అదుర్స్

Update: 2017-01-28 05:02 GMT

వివిధ దేశాల నుంచి వచ్చిన వ్యాపార, వాణిజ్య ప్రముఖులు, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు కోలాహలంగా సాగుతోంది. 42 దేశాల నుంచి 350కి పైగా వాణిజ్య ప్రతినిధులు, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో కిక్కిరిసిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొంటున్నారు. వరుసగా రెండవ ఏడాది విశాఖలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు అనూహ్య స్పందన లభించింది.

మంచి స్పందన....

CII భాగస్వామ్య సదస్సుకు అంచనాలకు మించి స్పందన, ప్రారంభ సెషన్‌కు పెద్దసంఖ్యలో పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార ప్రతినిధుల రావడంతో ప్రధాన సమావేశ మందిరం కిక్కిరిసింది. ముఖ్య అతిధిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో సదస్సు చైర్‌పర్సన్ శ్రీమతి నిర్మల సీతారామన్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు., కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, శాస్త్ర విజ్ఞాన శాఖ సహాయ మంత్రి వైఎస్ చౌదరిలు పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులకు ప్రభుత్వం పారదర్శక, ఉత్తమ పారిశ్రామిక విధానాలతో ప్రపంచదేశాలను ఆకర్షిస్తోందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ స్వాగతోపన్యాసంలో చెప్పారు. ఉక్రేయిన్, యుఏఈ, బంగ్లాదేశ్, నేపాల్, జింబాబ్వే, కాంబోడియా దేశాల ప్రతినిధులు, ఐఎంఎఫ్ ప్రతినిధులు ఈ సదస్సుకు రావడం విశేషమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన విజన్ ముందుపెట్టుకుని రెండంకెల సుస్థిర వృద్ధి రేటు కోసం కృషి చేస్తోందని ఏపీ ప్రధాన కార్యదర్శి టక్కర్ ప్రకటించారు. ఏపీలో పరిశ్రమలకు అనుమతిలివ్వడంలో వార్ రూమ్ స్ట్రాటజీ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ప్రకటించారు.కేంద్ర సహకారంతో త్వరలో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్థాపన కోసం ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారన్నారు. కేంద్ర బడ్జెట్‌కుఒక నెల ముందే ఏపీలో జరుగుతున్న సదస్సుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరుకావడమే ఏపీ పట్ల ఆయన ప్రేమకు నిదర్శనమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రెండంకెల వృద్ధి రేటు సాధించడం ఆశ్యర్యం అనిపించలేదని, కానీ, దేశ సగటు కంటే ఎక్కువగా వృద్ధి రేటు సాధించడమే విశేషమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశం మొత్తం మీద ప్రథమ స్థానంలో నిలవడమే రాష్ట్రంలో పెట్టుబడులకు వున్న సానుకూలతలను తెలియపరుస్తోందని ., మూడేళ్ల క్రితం సహేతుకంగా లేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని వేరుచేశారని అరుణ్ జైట్లీ గుర్తు చేశారు. విభజనలో సమన్యాయం జరగకపోయినా రెండున్నరేళ్లలోనే ఏపీ దేశంలోనే అత్యుత్తమ పెట్టుబడుల కేంద్రంగా మారడం ఇక్కడి ప్రజల నిబద్ధతకు నిదర్శనంమని కితాబిచ్చారు. వృద్ధి రేటులో వెలువడిన అధికారిక గణాంకాలు కూడా ఇదే చాటాయన్నారు. విభజన సందర్భంగా ఏపీకీ అనేక హామీలు ఇచ్చామని, ఒకదాని తరువాత ఒకటి అన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నామన్నారు. దేశ వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధిరేటు మరి కొన్నేళ్లు ఎక్కువగానేే వుంటుంది, తీర ప్రాంతం ఏపీకి అత్యంత ప్రధాన వనరుగా వుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తియితే ఏపీ మరింత దూసుకువెళ్లడం ఖాయమన్నారు.

నోట్ల రద్దు చిక్కులు.....

డీమానిటైజేషన్ చర్య ప్రాధమికంగా కొన్ని చిక్కులు తెచ్చిపెట్టినా క్రమంగా అన్నీ సర్దుకుంటున్నాయని., రాజధాని నిర్మాణం, జలవనరుల అభివృద్ధి, తీర ప్రాంత అభివృద్ధి.. ఏపీకి అన్నీ సానుకూల అంశాలే ఉన్నందున పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. నాయకుడిగా వుండటమే చంద్రబాబునాయుడు ఏపీ అర్థికాభివృద్ధికి ప్రధాన వనరన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి హామీలిచ్చిందో అవన్నీ నిలబెట్టుకోవడమే కాకుండా ఈ రాష్ట్రానికి అన్నివిధాలుగా

సహకరిస్తాం, ఎందుకంటే దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి రేటును మెరుగుపర్చుకుంటున్న రాష్ట్రం ఇదే, ఏపీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని అరుణ్ జైట్లీ చెప్పారు.

పెట్టుబడుల ప్రక్రియ సరళం.....

గతంలో 3సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, రెండుసార్లు నవ్యాంద్రప్రదేశ్ లో మొత్తం 5 సార్లు తన హయాంలోనే సీఐఐ సదస్సులు నిర్వహించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పెట్టుబడుల ప్రక్రియ సరళంగా వుండాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని., ఒకరికొకరు పరస్పరం అవగాహన పెంచుకుని నెట్ వర్క్ అభివృద్ధి చెందేలా విధానాలు రూపొందించామన్నారు. వచ్చే ఏడాది 15 శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని., ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ప్రపంచంలోనే టాప్ 10 స్థానాల్లో వుండాలన్నదే తమ ధ్యేయమన్నారు. గ్యాస్, ఆయిల్ నిక్షేపాలతో ఏపీ సంపన్న రాష్ట్రంగా మారడం ఖాయమని గడచిన ఏడాదిలో రూ.2లక్షల 82 వేల 757 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 659 ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చాంమన్నారు. సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోవని ,వ్యయం ఆదా అవుతుందని దాంతో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు పెరుగుతాయన్నారు. ఏపీలో తిరుపతి, అమరావతి, విశాఖపట్టణం... ఎక్కడైనా పర్వాలేదు. అంధ్రప్రదేశ్‌ను మీ సెకండ్ హోమ్ గా మార్చుకోమని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. 11 బిలియన్ డాలర్ల పెట్టుబడితోె ఏపీలో ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు గత సీఐఐ సదస్సులో ఒప్పందం చేసుకున్నాం, అది పురోగతిలో ఉందని ఎస్సెల్ గ్రూపు చైర్మన్ సుభాష్ చంద్ర ప్రకటించారు. స్మార్ట్ సిటీ నిర్మాణం కోసం రూ.5 వేల కోట్ల పెట్టుబడులతో ఈసారి ఎంవోయూ చేసుకుంటున్నామన్నారు. 2029 నాటికి ఏపీ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందుతుందనడంలో సందేహమే లేదని చెప్పారు. ఏపీలాంటి గొప్ప రాష్ట్రానికి ప్రతినిధిగా వున్నందుకు గర్వపడుతున్నాను, ఈ రాష్ట్రం నుంచి పార్లమెంటుకు ఎంపికైన ప్రతినిధిగా పారిశ్రామికవేత్తలు అందరికీ స్వాగతం పలుకుతున్నానని రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు చెప్పారు. 2029 నాటికల్లా ఆయిల్ అండ్ గ్యాస్ రంగం భారతదేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించబోతోంది, ఏపీలో ఈ రంగంలో విస్తృత అవకాశాలు వున్నాయి, దీనిని పారిశ్రామికవేత్తలు ఉపయోగించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. సీఐఐ సదస్సులో తొలిరోజు హెచ్‌పీసీఎల్-గెయిల్ రూ.40 వేల కోట్లు, ఓఎన్జీసీ రూ.78 వేల కోట్లు, మరికొన్ని కలిపి మొత్తం రూ.లక్షా 28 వేల కోట్లు ఎంవోయూలు జరిగినట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.

Similar News