ఆపరేషన్ ఆకర్ష్ కు విరుగుడుగా జగన్ యాత్ర

Update: 2017-01-04 12:21 GMT

వైసీపీ అధినేత జగన్ పార్టీ పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ జరుగుతుండటంతో ఆయన క్యాడర్ లో జోష్ నింపేందుకు రైతు భరోసా యాత్ర కు పూనుకున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలనే ఆయన ఎంచుకున్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లినా తానున్నానని కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు చేసే ప్రయత్నమే ఈ రైతు భరోసా యాత్ర అని విశ్లేషకుల అభిప్రాయం.

రోడ్ షోలతో...

రైతు ఆత్మహత్యలు చేసుకున్న ప్రాంతంలో ఈ భరోసా యాత్ర జరగాల్సి ఉంది. అయితే జగన్ కర్నూలు జిల్లాను ఎంచుకున్నారు. కర్నూలు జిల్లా నుంచి ఇటీవల ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో అక్కడ క్యాడర్ ఉన్నప్పటికీ లీడర్లు లేకుండా పోయారు. ద్వితీయ శ్రేణీ నాయకులు, కిందిస్థాయి కార్యకర్తలు ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నారన్నది ఆ పార్టీ నేతలు చెబుతున్న విషయం. అందుకే ఆయన కర్నూలు నుంచి తన యాత్రను ప్రారంభించనున్నారు. కేవలం రైతులతో మాట్లాడటమే కాకుండా రోడ్ షో లను కూడా జగన్ నిర్వహించనున్నారు. రోడ్ షో లు కేవలం కార్యకర్తలు, ప్రజల కోసమేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ వైసీపీ అధినేత నియోజకవర్గ పార్టీ ముఖ్యనేతలతో ముఖాముఖి కూడా మాట్లాడనున్నారు. వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకే జగన్ ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

నేతలతో ముఖాముఖి....

గురువారం నుంచి వారం రోజుల పాటు కర్నూలు జిల్లాలో జగన్ పర్యటిస్తారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. పార్టీని వీడిపోయిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలనే జగన్ ఎంచుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ ఛార్జి లు కూడా లేరు. వారిని కూడా నియమించేందుకు కసరత్తులు జరుగుతున్నట్లు సమాచారం. మొత్తానికి కార్యకర్తల్లో భరోసా నింపేందుకే జగన్ ఈ యాత్ర చేపట్టారని భావించాల్సి వస్తుంది.

Similar News