ఆనందించే ఆటలాగా లేదు మరి!

Update: 2016-09-23 11:25 GMT

అనుకోని అతిథిలాగా వరుణుడు వచ్చి ఆటను స్తంభింపజేసేస్తే గ్యాలరీల్లో కూర్చున్న అభిమానులకు కోపం ముంచుకొచ్చేస్తుంది. వరుణుడి మీద ఆగ్రహంకలుగుతుంది. కానీ ఇదంతా ఎప్పుడు.. ఆట రంజుగా సాగుతూ.. విజయం మనకు దక్కుతుందని అనుకుంటున్నప్పుడు మాత్రమే. కానీ ఇప్పుడు కాన్పూర్‌లో భారత్‌ , న్యూజీలాండ్‌ తో ఆడుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ రెండో రోజు చివరి సెషన్‌ మొదలయ్యే ముందు వర్షం వచ్చి ఆట ఆగిపోతే.. అభిమానులు హమ్మయ్య అనుకున్నారంటే అతిశయోక్తి కాదు. అవును మరి న్యూజీలాండ్‌ ను కట్టడి చేయడంలో మనవాళ్లు విఫలం అవుతోంటే.. దానికంటె ఆట డ్రా దిశగా నడవడమే మేలని జనం అనుకోవడంలో తప్పేముంది.

తొలిరోజు 90 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 291 పరుగులు మాత్రమే చేసిన భారత్‌ రెండో రోజు 7 ఓవర్లకు మించి నిలబడలేకపోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ మొదలయ్యాక 10 వ ఓవర్లోనే.. గుప్తిల్‌ వికెట్‌ను యుటి యాదవ్‌ ఎల్బీడబ్ల్యు గా దొరకబుచ్చుకున్నాడు. పదో ఓవర్లోనే తొలి వికెట్‌ దక్కిందని ఎవరైనా మురిసిపోయి ఉంటే వారి అంచనాలు తప్పయ్యాయి. ఆ తర్వాత.. రెండో రోజు ముగిసే వరకు వికెట్‌ నష్టపోకుండా న్యూజిల్యాండ్‌ 152 పరుగులు చేసింది. కాకపోతే వారు 47 ఓవర్లు మాత్రమే ఆడారు. వర్షం ఆటంకం కలిగించింది.

భారతీయ బౌలర్లు ఎవ్వరూ కూడా ఏ దశలోనూ న్యూజీలాండ్‌ జట్టుపై ప్రభావం చూపించలేకపోవడం విశేషం. వర్షం ఆదుకుంటే గనుక.. మ్యాచ్‌ డ్రా దిశగా నడవవచ్చునని అభిమానులు భావిస్తున్నారు.

Similar News