ఆ విధముగా హోదా బిల్లుకు మంగళం పాడడమైనది!

Update: 2016-11-18 11:38 GMT

ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావడం అనేది చాలా కష్టసాధ్యమైన సంగతి. అయితే.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటను, అదే పార్లమెంటు సాక్షిగానే తేలిపోయినట్లు చాటి చెప్పాలనే ఉద్దేశంతో అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రెవేటు మెంబరు బిల్లు, మనీ బిల్లు అంటూ లోక్‌సభ తేల్చేసింది. దీంతో కనీసం పార్లమెంటులో హోదా గురించిన చర్చ సాగితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సానుభూతి అయినా దక్కతుందనుకున్న ఆశ కూడా అడియాస అయినట్లే లెక్క.

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రెవేటు మెంబరు బిల్లును ప్రవేశ పెట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంతో పాటు, విభజన చట్టంలోని, ఇంకా అమలు కాకుండా ఉన్న అనేక అంశాలను ఆయన ఆ బిల్లులో పొందు పరిచారు. దీని మీద రాజ్యసభలో చర్చ జరిగింది. ఆ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ దీనిని ద్రవ్యబిల్లుగా అభివర్ణించారు. ఇది ద్రవ్యబిల్లు కానే కాదంటూ విపక్షాలు వాదించాయి.

ఈ విషయంపై రాజ్యసభ ఛైర్మన్ దీనిని లోక్ సభ స్పీకరుకు నివేదించారు. న్యాయశాఖ అభిప్రాయం కూడా తీసుకున్న తరువాత ఇది మనీ బిల్లేనని, దీనిని లోక్‌సభలోనే ప్రవేశ పెట్టాలని తేల్చారు.

అయితే ఈ వ్యవహారంపై కేవీపీ రామచంద్రరావు మరియు కాంగ్రెస్ నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం విశేషం. భాజపా భయపడుతున్నదనడానికి ఇది నిదర్శనం అని, తాము రాజకీయంగా విజయం సాధించినట్లేనని వారు అంటున్నారు.

తన బిల్లు మనీబిల్లు కానే కాదని లోక్ సభ స్పీకరు చాలా స్పష్టంగా చెప్పారని, అయితే ఆ తర్వాత.. న్యాయశాఖ అభిప్రాయం తీసుకుని, దీనిని మనీ బిల్లుగా తేల్చి కొట్టేశారని కేవీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం అని ఆయన అంటున్నారు. స్పీకరు నిర్ణయం అనుకూలంగా ఉన్నా బిల్లును కొట్టేయడం అన్యాయం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీని మీద సుప్రీం కోర్టులో సవాలు చేస్తాం అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.

ప్రత్యేక హోదా కోరిన బిల్లును మనీ బిల్లుగా ముద్ర వేసి... అది అనివార్యంగా తమకు బ లం, బలగం పుష్కలంగా ఉన్న లోక్ సభలోనే చర్చకు పెట్టాల్సిన పరిస్థితిని తీసుకువచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గి, ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులోనే తేల్చుకుంటాం అని చెప్పడం విశేషం.

Similar News