అవసరానికి తగ్గట్టు పెరగలేదంటున్న ఎమెల్యేలు!

Update: 2016-04-04 14:20 GMT

ఆర్థిక ఇబ్బందులున్నా శాసనసభ్యుల జీతాలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారు. అవసరాలకు తగ్గట్లుగా వేతనాలు పెంచలేదన్నది వీరి బాధగా కనిపిస్తోంది. పొరుగునే ఉన్న తెలంగాణలో ఎమ్మెల్యేల వేతనాలు ఏకంగా రూ. 2.75 లక్షలకు పెంచితే ఇక్కడ కేవలం రూ. 1.25 లక్షలకు మాత్రమే పెరిగాయని పలువురు చిన్నబోతున్నారు. అయితే విషయాన్ని అధికార తెదేపా ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడేందుకు ముందుకు రాకపోవడం విశేషం.

తెలంగాణ ఎమ్మెల్యేలతో పోలిస్తే తమకు పెరిగింది స్వల్పమేనని వారు సన్నిహితుల వద్ద వాపోతున్నారు.ఎమ్మెల్యేల వేతనాల పెంపుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వారం రోజుల వ్యవధిలోనే నిర్ణయం తీసుకున్నాయి. యాదృచ్చికమే అయినప్పటికీ ఈ పెంపుపై ఇరు రాష్ట్రాల ఎమ్మెల్యేలలో ఒక రాష్ట్రం నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తే మరో రాష్ట్రం ఎమ్మెల్యేలు నిస్తేజాన్ని వ్యక్తం చేస్తున్నారు.పెరిగిన వేతనాలు తక్కువగా ఉండటానికి కారణం వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కారణమని భాజపా ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. నీతి, నిజాయితీగా పని చేసే ఎమ్మెల్యేలకు పెంచిన వేతనం ఏ మాత్రం సరిపోదని ఆయన స్ఫష్టం చేశారు.

రాజకీయాలలో నిజాయితీగా ఉండాలంటే పెంచిన వేతనం ఏ మాత్రం సరిపోదు, నిజాయితీగా ఎమ్మెల్యేలు ఉండాలని ప్రభుత్వం భావిస్తే వెంటనే వేతనాలను మరింతగా ఫెంచాలని తిరుపతిలో విలేఖరులతో మాట్లాడిన రాజు పేర్కొన్నారు. పొరుగునే ఉన్న తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎంత మేర వేతనాలను పెంచారనేది కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేడర్ను కాపాడుకోవాలంటే ఎమ్మెల్యేలకు వేతనాలను పెంచాల్సి ఉంటుందని క్రింది స్థాయి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు అంటున్నారు. వైసీపీలో చాలా మంది సంపన్న వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలుండటం వల్ల ఆ పార్టీ వేతనాల పెంపును వ్యతిరేకిస్తుందని, వేతనాల పెంపుపై వైసీపీ మరింత ఒత్తిడి తెచ్చి ఉంటే తమకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగేదని వారంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఏకంగా 45 శాతం ఫిట్ మెంట్ను ప్రకటించిన ప్రభుత్వం నామమాత్రగా ఉన్న ఎమ్మెల్యేల వేతనాల విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News