అరుణ్‌జైట్లీతో సమావేశమైన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

Update: 2017-01-23 17:44 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్చద్ర‌బాబునాయుడు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం ఢిల్లీకి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి... సోమ‌వారం అరుణ్‌జైట్లీతో భేటీ అయ్యారు. సుమారు గంట‌పాటు జ‌రిగిన ఈ స‌మావేశంలో ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించాల్సిన అవ‌స‌రాన్ని సిఎం వివ‌రించారు. ప్ర‌త్యేక హోదాకు బ‌దులు ప్యాకేజీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ... దానికి చ‌ట్ట‌బ‌ద్ద‌త ఇవ్వ‌లేదని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు గుర్తు చేశారు. త‌క్ష‌ణం.. చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించేందుకు కేంద్ర క్యాబినెట్‌ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, వ‌చ్చే బ‌డ్జెట్ స‌మావేశాల్లో అయినా ఈ హామీని నెర‌వేర్చాల‌ని సిఎం విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ప‌లు అంశాలు అప‌రిష్కృతంగా ఉన్నాయ‌ని, వీటి అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా ఆర్ధిక మంత్రిని కోరారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై కూడా... చంద్ర‌బాబు జైట్లీతో చ‌ర్చించారు. వ‌చ్చే పార్ల‌మెంటు స‌మావేశాల్లో అయినా.... చ‌ట్టంలో మార్పులు చేసి నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని కోరారు.

ఈ నెల 27, 28 తేదీల్లో విశాఖ‌ప‌ట్నంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న‌ భాగ‌స్వామ్య స‌దసుకు హాజ‌రు కావాల‌ని అరుణ్ జైట్లీని ముఖ్య‌మంత్రి ఆహ్వానించారు. స‌దసు ప్రారంభ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని చంద్ర‌బాబు కోర‌గా... జైట్లీ సానుకూలంగా స్పందించారు. బ‌డ్జెట్ త‌యారీ, ఇత‌ర కీల‌క‌ అంశాల్లో పని ఒత్తిడి ఉన్నా... హ‌జ‌ర‌య్యేందుకు త‌ప్ప‌క ప్ర‌య‌త్నిస్తాన‌ని జైట్లీ చెప్పారు. పెద్దనోట్ల ర‌ద్దు త‌ద‌నంత‌ర ప‌రిణామాలు, న‌గ‌దు ర‌హిత లావాదేవీల ప్రోత్స‌హం విష‌యంలో తీసుకున్న చ‌ర్య‌లు, రానున్న కాలంలో ఏ విధంగా ముందుకు సాగాలి అనే అంశాల‌ను కూడా చ‌ర్చించారు.

Similar News