అమ్మ ఆరోగ్యం విషమం : అపోలో చుట్టూ సైన్యం!

Update: 2016-12-05 00:21 GMT

తమిళ అభిమానులు ప్రేమగా పిలుచుకునే అమ్మ, పురట్చితలైవి జయలలిత ఆరోగ్యం విషమంగా మారింది. ఆదివారం సాయంత్రం 5 గంటల తరువాత గుండెపోటు రావడంతో ఆమెను సాధారణ వార్డు నుంచి మళ్లీ ఐసీయూకు తరలించి నిపుణుల పర్యవేక్షణలో చికిత్సలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆస్పత్రి వర్గాలు మళ్లీ ఎలాంటి వివరాలు చెప్పకపోవడం.. రాష్ట్రంలోను దేశంలోను కనిపిస్తున్న పరిణామాలు అభిమానుల్లో ఆందోళన పెంచుతున్నాయి. అమ్మ పరిస్థితి విషమంగా ఉన్నదేమో అని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఆ నేపథ్యంలో వేల సంఖ్యలో అపోలో ఆస్పత్రి బయట గుమికూడిన అమ్మ అభిమానులు ఏడుపులు, విలాపాలతో పరిస్థితి విషాదభరితంగా మారిపోయింది. వారు ఆస్పత్రిలోకి ప్రవేశించ డానికి బలవంతంగా ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. అభిమానులు ఎలాంటి హింసాత్మక చర్యలకైనా పాల్పడవచ్చుననే ఉద్దేశంతో అపోలో చుట్టూ భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించారు. ఇలాంటి సంకేతాలన్నీ అభిమానుల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి.

ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో అప్రకటిత కర్ఫ్యూ అమల్లో ఉంది.

తమిళనాడు వ్యాప్తంగా పెట్రోలు బంకులను మూసివేశారు. అపోలో చుట్టూ ఉన్న హోటళ్లను కూడా ఖాళీ చేయించారు. మూత వేయించారు. త మిళనాడు వ్యాప్తంగా విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. డీజీపీ స్వయంగా రాష్ట్రలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోని పోలీసు అధికారులు అందరూ సోమవారం యూనిఫారంలోనే అధికారిక వాహనాల్లోనే విధులకు రావాలని ప్రత్యేకంగా ఆదేశాలు వెళ్లాయి. అలాగే సెలవుల్లో ఉన్న పోలీసులు అందరూ కూడా వెంటనే సెలవు రద్దు చేసుకుని విధుల్లో జాయిన్ కావాలని కూడా ఆదేశించారు.

రాష్ట్ర పోలీసులు రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారా మిలిటరీ బలగాలను మోహరించాలని కేంద్రాన్ని కోరింది. చిన్న గ్రామస్థాయి నుంచి పెద్ద సంఖ్యలో పోలీసుల్ని అప్రమత్తం చేస్తున్నారు.

ఢిల్లీనుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఇప్పటికే చెన్నయ్ బయల్దేరారు. గవర్నర్ విద్యాసాగర్ రావు అపోలో ఆస్పత్రికి హుటాహుటిన వచ్చి డాక్టర్లతో ఓ పది నిమిషాలు మాట్లాడి రాజ్ భవన్ కు వెళ్లిపోయారు. మీడియాతో ఏమీ మాట్లాడలేదు. రాజ్‌భవన్ కు వెళ్లిన తర్వాత కూడా అధికారిక ప్రకటన కూడా చేయలేదు.

కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా.. అపోలో ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడుతున్నారు. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని నరేంద్రమోదీ.. జయలలిత తొందరగా కోలుకోవాలంటూ ట్వీట్ లు చేశారు. ప్రధాని మోదీ చెన్నయ్ బయల్దేరి వస్తున్నట్లు కూడా వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన మరింత హెచ్చుతోంది. అపోలో ఆస్పత్రిలోనే హడావుడిగా నిర్వహించిన కేబినెట్ సమావేశం కూడా అనుమానాలకు కారణమవుతోంది.

వైద్యులు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. జయలలిత పరిస్థితి ఇక సందేహమేనని అభిమానులు భయపడుతున్నారు. అపోలో డాక్టర్లు ఒకవైపు లండన్ వైద్య నిపుణుడు బాలేతో కూడా మాట్లాడుతున్నారు. ఎయిమ్స్ నుంచి వైద్యులు కూడా ప్రత్యేక విమానంలో చెన్నయ్ వస్తున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడులో అప్రకటిత కర్ఫ్యూ నడుస్తోంది. ఇవాళ పరిస్థితి మొత్తం గందరగోళంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

Similar News