అమెరికాలో భద్రత ఉందా? : సెనేటర్ల అనుమానం

Update: 2017-02-25 08:30 GMT

అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మరణించిన కూచిభొట్ల శ్రీనివాస్ పట్ల ఇండో అమెరికన్ సెనేటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికాలో విధ్వేషాన్ని గెలవబోనీయమని ఇండో అమెరికన్ సెనేటర్ కమల్ హారిస్ ట్వీట్ చేశారు. కాల్పుల జరిగిన సంగతి తెలుసుకుని తాను తీవ్రంగా బాధపడ్డానని, శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు హారిస్ సానుభూతి తెలియజేశారు. మతిలేని పనులకు, విధ్వేష చర్యలకు అమెరికాలో చోటులేదని మరో ఇండో అమెరికన్ సెనేటర్ ప్రమీల జయపాల్ అన్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దేశంలో విధ్వేషాలు పెరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వలసదారుల పట్ల ఆయన చేస్తున్న ప్రకటనలు, అనుసరిస్తున్న విధానాల వల్లే ఇలాంటి సంఘటనలకు కారణమవుతున్నాయని ప్రమీల అభిప్రాయపడ్డారు. అలాగే జాతి అహంకార పూరిత నేరాలను సహించేది లేదని మరో ఇండో అమెరికన్ సెనేటర్ రో ఖన్నా అన్నారు. ఇక్కడి న్యాయ వ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మక ముందన్నారు. ఇది పూర్తిగా శ్రీనివాస్ పై జరిగిన దాడి కాదని, యావత్ భారతీయులపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. అమెరికా భద్రతపై భారతీయుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయని ఆయన చెప్పారు.

భారత్ కు మృతదేహాన్ని తెచ్చేందుకు ఏర్పాట్లు....

దుండగుడి కాల్పుల్లో బలై పోయిన శ్రీనివాస్ కూచిభొట్ల మృతదేహాన్ని భారత్ కు తెప్పించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడి తెలుగు సంఘాల నాయకులు దగ్గరుండి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి శ్రీనివాస్ మృతదేహం బయలుదేరే అవకాశమున్నట్లు చెబుతున్నారు.

Similar News