అమెరికా 45వ అధ్యక్షుడు ట్రంప్

Update: 2016-11-09 07:57 GMT

డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. అమెరికా నూతన అధ్యక్షుడుగా ఆయన విజయం సాధించారు. హిల్లరీ క్లింటన్ మీద ఆయన తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అంటూ తన ఎన్నికల ప్రచారంలో ప్రకంపనాలు సృష్టించిన ట్రంప్ అదే క్రమంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా విజయం సాధించారు.

అధ్యక్ష స్థానాన్ని అధిరోహించడానికి 270 స్థానాల్లో విజయం సాధించడం ఆవశ్యకం అయిన పరిస్థితిలో ట్రంప్ 276 స్థానాల్లో గెలిచారు. అదే సమయంలో హిల్లరీ క్లింటన్ ప్రస్థానం 218 స్థానాల వరకే పరిమితం అయింది. దీంతో అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు.

కాలిఫోర్నియా వంటి పెద్ద రాష్ట్రంలో విజయం సాధించినా కూడా హిల్లరీ క్లింటన్ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. మెజారిటీ రాష్ట్రాల్లో ట్రంప్ హవానే కొనసాగింది. ట్రంప్ కు మొత్తం 56797101 ఓట్లు పోలయ్యాయి. హిల్లరీ క్లింటన్ కు 55741659 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

అందరం కలసి పనిచేద్దాం : ట్రంప్

ఇది అందరం కలసి పనిచేయాల్సిన సమయం.. అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరికీ నేను అధ్యక్షుడినే అంటూ విజయం అనంతరం ప్రసంగిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రజలను ఉద్దేశించి అన్నారు. హిల్లరీ క్లింటన్ చాలా కష్టపడ్డారని తాను ఆమెనేు అభినందిస్తున్నానని చెప్పారు. మనమంతా ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపు ఇచ్చారు. అమెరికాకు పూర్వ వైభవం తీసుకువస్తానన్నారు. ఈ విజయం చాలా చారిత్రాత్మకమైనదని ట్రంప్ అభివర్ణించారు. హిల్లరీ కూడా తనకు ఫోను చేసి అభినందించారని ఆయన చెప్పారు.

Similar News