అమరావతి అద్భుత వాస్తు నగరం : చంద్రబాబు

Update: 2016-11-30 11:42 GMT

అమరావతి నగరం ఇంకా రూపుదిద్దుకోకపోవచ్చు.. కానీ.. దేశంలో ఏ నగరానికీ లేనన్ని ఎడ్వాంటేజీలు ఉన్న నగరం ఇదే అంటూ చంద్రబాబునాయుడు ప్రశంసిస్తున్నారు. అమరావతి నేల మీదనుంచే పూర్తిస్థాయిలో తన కార్యాలయంలోకి ప్రవేశించిన సందర్భంలో తనను అభినందించిన ఉద్యోగులను ఉద్దేశించి సొంత నేల మీద నుంచి పూర్తిస్థాయి పాలన సాగించడం చాలా గర్వకారణమని, ప్రజాసేవలో అపురూప ఘట్టంగా మనం దీనిని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

అమరావతిని ప్రపంచం మెచ్చే ప్రజారాజధానిగా నిర్మించడమే తన జీవితకాల ధ్యేయంగా ముఖ్యమంత్రి చెప్పారు. ప్రపంచంలో ఏ రాజధానికి అమరావతికి ఉన్నన్ని ఆకర్షణలు లేవని సీఎం ప్రస్తావించారు. ఒక పక్క కృష్ణా నది, పూర్తి వాస్తు, ఆహ్లాదంగా వుండే పర్వత శ్రేణులు, అంతటా పచ్చదనం అమరావతి సొంతమని అన్నారు. తన నూతన కార్యాలయంలో ప్రవేశానికి బుధవారం ఉదయం 11 గంటలు దాటిన తరువాత వెలగపూడి చేరుకున్నారు.

‘ఉద్యోగుల త్యాగాలు ఊరికే పోవు, మీ ఇబ్బందులు తొలగించి ఎల్లవేళలా తోడుగా వుంటా’నని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం ఉదయం వెలగపూడి సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ప్రభుత్వ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. మనమందరం కలిసి పెద్ద కుటుంబంగా వున్నామని అన్నారు. ‘ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత నాది, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిపాలనకు సహకరించే బాధ్యత మీది’-అని ముఖ్యమంత్రి వారితో అన్నారు. ప్రభుత్వ పరిపాలనలో సాంకేతికతను సమర్ధంగా, సంపూర్ణంగా ఉపయోగించుకుని అభివృద్ధి దిశగా ముందుకు వెళదామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

చరిత్ర స్మరించుకున్న చంద్రబాబు

వెలగపూడి సచివాలయంలోకి ప్రవేశించిన సందర్భంగా.. ఇక్కడివరకు దారితీసిన తెలుగు రాష్ట్ర పరిస్థితులను వరుసగా చంద్రబాబు అన్నిటినీ స్మరించుకున్నారు.

తెలుగువారు తొలి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారని ఆయన చెప్పారు. రాజధాని కోసం ఇన్ని ఇబ్బందులు పడింది చరిత్రలో వేరొకరు లేరని ముఖ్యమంత్రి అన్నారు. ఒకనాడు మద్రాస్ ఉమ్మడి రాజధానిగా వున్న తెలుగువారు పొట్టిశ్రీరాములు త్యాగంతో సొంత గడ్డపై రాజధాని ఏర్పాటుచేసుకున్నారని, రెండు ప్రాంతాలవారు సమైక్యంగా వుండాలని పెద్ద మనుషులు చెబితే కర్నూలు నుంచి హైదరాబాద్‌కు రాజధానిని మార్చుకున్నారని గుర్తుచేశారు. ఆరు దశాబ్దాల కష్టాన్ని ఆవిరిచేస్తూ అశాస్త్రీయంగా చేసిన విభజనతో మళ్లీ కొత్త రాజధానిని వెతుక్కుంటూ వచ్చామని అన్నారు. తొమ్మిది సంవత్సరాలు ఎంతో శ్రమించి హైదరాబాద్‌ను ప్రపంచ పఠంలో నిలిపానని, ఇప్పుడు మళ్లీ నవ్యాంధ్రప్రదేశ్ కోసం అంతకుమించి కష్టపడుతున్నానని అన్నారు. కేవలం రాజకీయ కారణాలతో హేతుబద్దత లేని విధానాలతో అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌తో కొత్త రాష్ట్రంలో కొత్త ప్రయాణం ప్రారంభించామని వ్యాఖ్యానించారు. విజయవాడలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటుచేసుకునే వరకు బస్సులోనే వుండి పాలన సాగించానని చెబుతూ, ఇప్పుడు వెలగపూడి సచివాలయంలో తన ప్రవేశం రెండో మజిలీగా పేర్కొన్నారు. నవ్యాంధ్ర చరిత్రలో ఈరోజు నుంచి ఒక కొత్త శకం ప్రారంభమైనట్టుగా భావించాలని అన్నారు.

Similar News