అన్ని చోట్ల ఘనంగా అంబేత్కర్ జయంతి వేడుకలు!

Update: 2016-04-15 00:53 GMT

పార్లమెంట్ ఆవరణలో డా. భీమ్‌రావ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ప్రధాని నరేంద్రమోదీ అంబేద్కర్ జై భీమ్, విశ్వ మానవ్ అంటూ ట్వీట్ చేశారు. కాగా అంబేద్కర్ జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని మహూలో ప్రధాని పర్యటించనున్నారు. హైదరాబాద్ నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ట్యాంక్‌ బండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమ్‌ ఆద్మీపార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అంబేడ్కర్‌ అభిమానులు, యువజన సంఘాల ప్రతినిధులు వేర్వేరుగా వచ్చి పూలమాల వేశారు. హైదరాబాద్ లోని అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Similar News