అదే తప్పు చేస్తున్న పాక్‌ : ఉగ్రవాదులకు అగ్రపూజ

Update: 2016-10-05 14:58 GMT

పాకిస్తాన్‌ మళ్లీ చేసిన తప్పే చేస్తోంది. పదేపదే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లుగా భారత్‌ మీద దాడులను , భారత్‌లో లక్ష్యించిన ఉగ్రవాదులను నెత్తిన పెట్టుకుంటోంది. ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాదులకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా బుధవారం నాడు పాకిస్తాన్‌ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఈ దాడులను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

తాము శాంతినే కోరుకుంటున్నామని, భారత్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నదని పాత పాటనే పాడిన నవాజ్‌ షరీఫ్‌.. తాను దేశంలో లేని సమయంలో.. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తున్న సమయంలో.. ఇక్కడ ఉరీ దాడులు జరిగాయి అన్నట్లుగా అభివర్ణించారు. అసలు ఉరీ దాడులు అనేదే అసత్యం అన్నట్లుగా కలర్‌ ఇచ్చేలా.. ఉరీ దాడులపై నిష్పాక్షికమైన అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉన్నదని కూడా నవాజ్‌ షరీఫ్‌ డిమాండ్‌ చేశారు.

భారత్‌ కాల్పుల్లో ఇద్దరు మాత్రమే చనిపోయారని అన్న నవాజ్‌.. ఉగ్రవాది బుర్హాన్‌ వనీపై ప్రశంసలు కురిపించడమే ఇక్కడ కీలకాంశం. ఆయనను హీరోగా అభివర్ణిస్తూ నవాజ్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారత్‌ పై దాడులకు తెగబడ్డ వారిని హీరోలుగా పేర్కొనడం నవాజ్‌కు కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అసలే ఇరుదేశాల మధ్య పరిస్థితి సునిశితంగా ఉన్న సమయంలో మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా రెచ్చగొట్టేవే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News