అడ్డం గా దోచుకుంటున్న తండ్రి కొడకులు: రోజా

Update: 2016-04-02 23:26 GMT

అవినీతిరహిత పాలన అంటూనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్ అడ్డంగా దోచుకుంటున్నారని వైస్సార్సీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారి గొంతు నొక్కే ప్రయత్నాన్ని తెలుగుదేశం ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి అసెంబ్లీలో మాట్లాడినందుకే తనపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న కాల్ మనీ సెక్స్ రాకెట్ ను ఎందుకు ఆపలేకపోతున్నారని రోజా ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆడపిల్ల ఉంటే మహిళల సమస్యల గురించి తెలిసేదని ఆమె అన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితులను కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్నారు. శాసనసభను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లా వాడుకుంటున్నారన్నారు.

అసెంబ్లీ నుంచి తనని ఏడాదిపాటు సస్పెన్షన్ చేయడంపై డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును రోజా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రోజా వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయని తెలుసుకుని ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. అయితే రోజా వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానున్నట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ తండ్రీకొడుకులిద్దరూ, అవినీతి సొమ్ముతో వైస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు రెండెకరాల నుంచి లక్షల కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తనను శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఎమ్మెల్యే బోండా ఉమ అనుచరుడు, ఆయన భార్య ఓ మహిళను బ్లాక్ మెయిల్ చేసి నీచానికి పాల్పడ్డారని ఆమె మండిపడ్డారు.

ఎనిమిది మంది ఎమ్మెల్యేల కోసం రాజ్యాంగాన్ని చంద్రబాబు ఉల్లంఘించారని, తెలంగాణలో ఎమ్మెల్యేలను పశువులను కొంటున్నట్లు కొన్నారన్న చంద్రబాబు ఏపీలో మాత్రం అభివృద్ధిని చూసి వస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. తెలంగాణలో స్పీకర్ అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ, ఏపీలో స్పీకర్ చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. చంద్రబాబుకు అసలు పాలించే అర్హత ఉందా? అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

Similar News