అచ్చెన్న లీక్ : వైకాపా ఎంపీలు జంప్ అవుతున్నారట!

Update: 2016-11-20 16:57 GMT

ప్రత్యేక హోదా కోసం సాగిస్తున్న పోరాటంలో భాగంగా.. పార్లమెంటు సమావేశాల తర్వాత తమ పార్టీ ఎంపీలను రాజీనామా చేయిస్తాం అని... హోదా అనే ఎజెండాతో తిరిగి ప్రజా తీర్పుకోసం ఉప ఎన్నికలకు వెళ్తాం అని.. గెలిచి ప్రభుత్వానికి నిరూపిస్తాం అని వైకాపా అధినేత జగన్మోహన రెడ్డి విసరుతున్న సవాళ్లు, చేస్తున్న ప్రతిజ్ఞలు ఆ పార్టీ ఎంపీల్లో బెదురు పుట్టిస్తున్నాయా? రాజీనామాలు చేసి, మళ్లీ ప్రజా తీర్పుకోసం వెళ్లడం కంటె.. ఏదైతే అది అయింది లెమ్మనుకుని తెలుగుదేశంలో చేరిపోవడం బెటర్ అని భావిస్తున్నారా? ఏమో.. మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన లీక్ చూస్తే అలాగే అనిపిస్తోంది.

ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా వైకాపా ఎంపీలు కొందరు తమ పార్టీలో చేరనున్నట్లుగా అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను ఆషామాషీగా కొట్టి పారేయాల్సిన అవసరం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పటికే అరకు ఎంపీ కొత్తపల్లి గీత, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తదితరులు తెలుగుదేశానికి సన్నిహితంగానే మెలగుతున్నారు. రాజీనామాల పట్ల విముఖతతో వారు జంప్ చేసినా ఆశ్చర్యం లేదు.

అయితే అచ్చెన్నాయుడు చెప్పింది అచ్చంగా జరుగుతుందా.. లేదా, జగన్ రాజీనామాల కోసం ఒత్తిడి తేకుండా కాలహరణం చేస్తే.. వారు కూడా మౌనంగా చివరి దాకా ఇదే పార్టీలో కొనసాగుతారా అనేది వేచి చూడాలి.

Similar News