జగన్ విష‍యంలో క్లియర్ అయిందా....!!

Update: 2018-12-24 03:30 GMT

అది విశాఖ తీరం. అన్ని కులాలకు, మతాలు కడుపులో పెట్టుకున్న ఎపి ఆర్ధిక నగరం. ఆ నగరానికి విచ్చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కెసిఆర్. ఆయనకు ఊహించని స్థాయిలో స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు కావడం తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశం గా మారింది. ఎయిర్ పోర్ట్ నుంచి చిన్నముషిటివాడ వరకు కెసిఆర్ కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన బ్యానర్లు ఒక ఎత్తయితే.... విమానాశ్రయంలో పెద్దసంఖ్యలో కెసిఆర్ అభిమానులు చేసిన సందడి మరొక ఎత్తు.

ఆకర్షణీయం ఆ బ్యానర్లు ...

ఇక ఇవన్నీ ఒకటైతే కెసిఆర్ స్వాగత బ్యానర్లలో అందరిని ఆకట్టుకున్నవి మాత్రం రెండే రెండు. వాటిలో ఒకటి వైఎస్ జగన్, కెసిఆర్ బొమ్మలతో ఉన్నవి. మరికొన్ని టిడిపి దివంగత నేత కింజారపు ఎర్రన్నాయుడు బొమ్మలతో కూడిన ఫ్లెక్సీలు. ఇక వైసిపి నేతలతో కూడిన బొమ్మలతో కెసిఆర్ ఫ్లెక్సీలు మరోవైపు చర్చనీయాంశం అయ్యాయి. ఏపీలో రాబోయే ఎన్నికల్లో కెసిఆర్ ఆశీస్సులు వైసిపి కే అన్నది ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే శత్రువుకు శత్రువు మిత్రుడన్న తంత్రంతో వైసిపి గులాబీ బాస్ కి స్వాగతం పలికిందన్నది దానికి ఒక పరమార్ధం వుంది.

ఆ వర్గీయుల సందడి మరో వైపు ...

వెలమ సామాజిక వర్గీయులు కెసిఆర్ కు సంఘీభావం తెలిపేందుకు వీటిని పెట్టినట్లు తెలుస్తుంది. గతంలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ విశాఖ వచ్చినప్పుడు యాదవ కులస్థులు వందలాది కార్లతో ఆయనకు స్వాగతం పలికి హల్ చల్ చేశారు. అదే రీతిలో వెలమ సామాజిక వర్గం తమ వర్గీయునికి తమదైన శైలిలో స్వాగతం పలుకడం విశేషం. దాంతో ఈ హడావిడి చూసిన తెలుగు తమ్ముళ్లు మాత్రం గులాబీ బాస్ ఎపి ఎన్నికల్లో ఎప్పుడు వేలు పెడతారన్న ఆందోళన స్పష్టం అవుతుంది. కొందరు ఈ విషయాన్నీ బాహాటంగా వ్యక్తం చేస్తుంటే మరికొందరు అంతర్గత చర్చల్లో కెసిఆర్ ఎపి పాలిటిక్స్ లో దిగేందుకు పూజలు చేసి వచ్చేస్తున్నారని లెక్కేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు వారాలు పూర్తి కాకుండానే ఎపి నుంచే తన ఫెడరల్ ఫ్రంట్ పర్యటనకు కెసిఆర్ శ్రీకారం చుట్టడం హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది.

Similar News