ఆది పాత్రపై అనుమానాలు..?

తన తండ్రి హత్య వెనుక మంత్రి ఆదినారాయణరెడ్డి పాత్ర ఉందని మెము చెబుతున్నా సిట్ ఆ దిశగా ఎందుకు విచారించడం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డా.సునీతరెడ్డి [more]

Update: 2019-03-27 06:35 GMT

తన తండ్రి హత్య వెనుక మంత్రి ఆదినారాయణరెడ్డి పాత్ర ఉందని మెము చెబుతున్నా సిట్ ఆ దిశగా ఎందుకు విచారించడం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డా.సునీతరెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆమె హైదరాబాద్ లో మాట్లాడుతూ… మా మనిషి చనిపోయి మేము బాధపడుతుంటే మేమే చంపామని నింద వేయడం న్యాయమేనా అని ప్రశ్నించారు. తమపై సానుభూతి చూపించాల్సింది పోయి ఇలా మాట్లాడటం సభ్యతేనా అన్నారు. నిజంగా మా కుటుంబం వారే తప్పు చేసి ఉంటే ఈపాటికి చంద్రబాబు బయట పెట్టి ఉండేవారు కాదా అని ప్రశ్నించారు. ఆదినారాయణరెడ్డి హత్య చేయించాడని తమకు అనుమానం ఉందని, ఆయనను చంద్రబాబుచ రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నింద పదేపదే తమ కుటుంబంపై వేసి విచారణను తప్పుదోవ పట్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తమ కుటుంబం గురించి అడిగిన ప్రతీ విషయాన్ని సిట్ కు చెప్పామన్నారు. తన కుటుంబంలోని వారిని, నాన్న అనుచరులను 10 రోజులుగా సిట్ విచారిస్తోందని, నిజంగా వారి పాత్ర ఉంటే బయటకు వచ్చేది కాదా అని ప్రశ్నించారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, తానొక డాక్టర్ నని, తన తండ్రి చనిపోతే తమపైనే నింద వేయడాన్ని భరించలేకే మాట్లాడాల్సి వస్తోందని వాపోయారు.

ఈ ప్రశ్నలకు బదులేది..?

ఈ సందర్భంగా సునీత పలు అనుమానాలను మీడియా ముందు లేవనెత్తారు. హత్య జరిగిందని ఉదయం 6.40కే సీఐకు సమాచారం ఇచ్చామని, ఆయన వచ్చే నాటికి సంఘటనా స్థలంలోనే మృతదేహం పడి ఉందన్నారు. అయినా తమ కుటుంబం ఆధారాలు చెడిపేసిందని ఎలా ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నంచారు. పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తమతో కలిసి పనిచేస్తాడని మంత్రి ఆదినారాయణరెడ్డి మధ్యవర్తిత్వంతో వచ్చారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి స్వయంగా చెప్పిన వీడియోను ఆమె చూపించారు. 15వ తేదీన హత్య జరిగితే పరమేశ్వర్ రెడ్డి 14న గుండెనొప్పి అని కడప ఆసుపత్రిలో చేరారని, ఆసుపత్రిలో తాను వివేకానందరెడ్డి మనిషినని అవసరం లేకున్నా నొక్కి చెప్పారనన్నారు. ఎటువంటి సమస్యా లేదని డాక్టర్లు వెంటనే పంపించేశారని అన్నారు. తర్వాత ఆయన సమీపంలోని హరిత హోటల్ లో టీడీపీ నేతలను కలిశారని ఆరోపించారు. తర్వాత మళ్లీ వెళ్లి అదే ఆసుపత్రిలో చేరారు. హత్య జరిగిన తర్వాత ఉదయం 4.30 గంటలకు అజ్ఞాత వ్యక్తి పరమేశ్వర్ రెడ్డి ఉన్న ఆసుపత్రికి వచ్చి పరమేశ్వర్ రెడ్డికి ఒక ఫోన్ చూపించి వెళ్లారని, అతను ఎవరని ప్రశ్నించారు. తర్వాత హుటాహుటిన ఆయన ఆ ఆసుపత్రి నుంచి వెళ్లి ఇంకో ఆసుపత్రిలో ఎందుకు చేరారని ప్రశ్నించారు. హాస్పిటల్ లో ఉండే పరమేశ్వర్ రెడ్డి అనేక కథలు చెప్పారని, విచారణ గురించి తెలియని వ్యక్తి ఇవన్నీ ఎలా చెప్పాడన్నారు. హత్య జరిగిన తర్వాత ఆదినారాయణరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుకున్నారని ఆరోపించారు.

గెలవలేరని హత్య చేశారు

జగనన్నను ముఖ్యమంత్రిని చేయడం, అవినాష్ ను ఎంపీగా గెలిపించడం కోసమే తన తండ్రి పనిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రేపు చనిపోతాడనే ముందు రోజు కూడా రాత్రి 10 గంటల వరకు జమ్ములమడుగులో స్థానిక నేతలతో మాట్లాడి వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. తన తండ్రి లేకపోతేనే ఆదినారాయణరెడ్డి గెలుపు సులువవుతుందని వారు ఆలోచించి హత్య చేశారేమోనని తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ విషయాలన్నీ సిట్ కు చాలాసార్లు చెప్పినా ఆ దిశగా మాత్రం విచారించడం లేదన్నారు. తన తండ్రి హత్యతో తాను బాధలో ఉంటే తన తండ్రి మరణాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారనే బాధతోనే తాను మీడియా ముందుకు రావాల్సిన అవసరం వచ్చిందన్నారు.

Tags:    

Similar News