పులివెందులలో జగన్ భావోద్వేగం

తనకు, తన తండ్రికి పులివెందుల అంటే ఎంతో ప్రేమ అని, పులివెందుల గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం [more]

Update: 2019-03-22 07:22 GMT

తనకు, తన తండ్రికి పులివెందుల అంటే ఎంతో ప్రేమ అని, పులివెందుల గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పులివెందులలో నామినేషన్ వేయడానికి ముందు సభలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘ఇక్కడి ప్రజల మంచితనాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. కష్టంలోనూ గుండెధైర్యంతో ఉండటం ఈ గడ్డ నేర్పించింది. వందల కుట్రలు జరుగుతున్న బెదరకుండా ఎలా ఉండాలో ఈ గడ్డ నేర్పించింది. ఈ గడ్డ నాకు సహనం నేర్పించింది. ఎదుటివారు కుట్రలు చేస్తున్నా చెరగని చిరునవ్వుతో ఎలా ఉండాలో ఈ గడ్డ నేర్పించింది. చీకటి తర్వాత వెలుగు వస్తుందని, ఒపికతో ఉండాలని ఈ గడ్డ నేర్పించింది. రాతినేలలోనూ సేధ్యం చేయడం నేర్పించింది ఈ గడ్డ.’’ అని పేర్కొన్నారు.

అరెస్టులు చేస్తారేమో…

‘‘పులివెందుల ప్రజలు నాలుగు దశాబ్దాలు నాన్నను, చిన్నాన్నను, అమ్మను ఆశీర్వదించారు. నాన్న చనిపోయాక నాకు అండగా నిలిచారు. మళ్లీ పులివెందుల ప్రజల దీవెనలు కావాలి. ప్రపంచంలో చిన్నాన్న వివేకానందరెడ్డి వంటి సౌమ్యులు ఎవరూ ఉండరు. ఆయనను చంపించిందీ టీడీపీ వాళ్లే.. మళ్లీ బురద జల్లేదీ వాళ్లే. చంపించింది వాళ్లే.. విచారణ చేసేది వాళ్ల చేతుల్లోనే ఉన్న పోలీసులు. వాళ్లకు కవాల్సినట్లుగా రాసేది వాళ మీడియానే. కడపలో గెలవరనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఐదేళ్ల అన్యాయపు, మోసపు పాలనతో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకే కుట్రలు ప్రారంభించారు. చిన్నాన్నను చంపితే జమ్మలమడుగులో ఎవరూ తిరగరని ఆయనను చంపేశారు. ఈ నేపాన్ని కుటుంబసభ్యులపై నెట్టేసి అరెస్ట్ చేస్తే పులివెందులలోనూ ఎవరూ తిరగరని అనుకుంటున్నారు. వారి పాలనపై ఓట్లడిగే సత్తా లేక.. కేవలం కడపలో హత్యా రాజకీయాలపై ఎన్నికలు జరగాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. నాన్న చనిపోయినప్పుడు నేను కాంగ్రెస్, చంద్రబాబుతో కొట్లాడేటప్పుడు, కేసులు ఎదుర్కున్నప్పుడు నాకు తోడుగా పులివెందుల ప్రజలే నిలబడ్డారు. రేపు అటువంటి పరిస్థితే వస్తే, చంద్రబాబు ఎటువంటి అన్యాయపు కేసులు పెట్టినా, అన్యాయపు అరెస్టులు చేసినా సంయమనం పాటించాలి. ఎన్నికల వరకు పార్టీకి సంబంధించి పెద్ద నాయకులను అరెస్ట్ చేస్తారేమో. కానీ, గ్రామాల్లో ఉండే అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే ఎన్నికలు చేయాల్సి ఉంటుందేమో. చంద్రబాబు మోసపు పాలన అంతం చేయడం ప్రజల చేతుల్లోనే ఉంది. రావణుడి పాలన వానరుల చేతిలోనే అంతం అయ్యిందని గుర్తుంచుకోవాలి.

ఓట్లు చీల్చడమే పవన్ పని

‘‘చంద్రబాబు ఆదేశాల ప్రకారం ఆయన పార్ట్ నర్ పవన్ కళ్యాణ్ నడుచుకుంటున్నారు. పవన్ సినిమాకు డైలాగులు, దర్శకత్వం, నిర్మాత అన్నీ చంద్రబాబే చేస్తున్నారు. చంద్రబాబు చెప్పిన వారికే టిక్కెట్లు ఇస్తున్నారు. లక్ష్మీనారాయణను టీడీపీలోకి తీసుకొని టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారు. కానీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, జనసేన నుంచి పోటీ చేయిస్తున్నారు. ప్రతిపక్ష ఓట్లను చీల్చడానికి వీరు డ్రామాలు ఆడుతున్నారు. మనకు ఇటువంటి డ్రామాలు అవసరం లేదు. నేను దేవుడిని నమ్ముతాను. ప్రజల మీద ఆధారపడతాను. వీళ్లు ఎన్ని కుట్రలు చేసినా వచ్చేది మన ప్రభుత్వమే.’’ అని జగన్ పేర్కొన్నారు.

Tags:    

Similar News