చంద్రబాబుపై జగన్ ప్రశ్నల వర్షం..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశచరిత్రలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ కి పాల్పడ్డారని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రజల డేటా చోరీపై బుధవారం [more]

Update: 2019-03-06 12:59 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశచరిత్రలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ కి పాల్పడ్డారని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రజల డేటా చోరీపై బుధవారం ఆయన గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ… పథకం ప్రకారం రెండేళ్ల నుంచే చంద్రబాబు నాయుడు ఎన్నికలను దొంగ దారుల్లో ఎదుర్కునేందుకు ప్రయత్నం మొదలుపెట్టారని ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉండకూడదని ప్రజల ఆధార్ వివరాలు, బ్యాంకు అకౌంట్ వివరాలను ఐటీ గ్రిడ్ సంస్థ, టీడీపీ సేవామిత్ర యాప్ లో దొరకడం నేరం కాదా అని ప్రశ్నించారు. కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ జాబితా ఎన్నికల సంఘం వద్ద తప్ప ఎవరి వద్దా ఉండకూడదని, కానీ ఐటీ గ్రిడ్ సంస్థ వద్ద మాత్రం కలర్ ఫోటోతో కూడిన ఓటర్ డేటా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన ఆర్టీజీఎస్, పల్స్ సర్వే వివరాలు కూడా ఐటీ గ్రిడ్ వద్దకు వచ్చాయన్నారు. ఐటీ గ్రిడ్ వద్ద ఉన్న ప్రజల వివరాలన్నీ సేవా మిత్ర యాప్ లో ఉన్నాయని, ఈ యాప్ ద్వారా టీడీపీకి అనుకూలంగా లేని వారి ఓట్లను పథకం ప్రకారం తొలగించారని అన్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి రెండు ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు.

నేరం చేసి రెండు రాష్ట్రాల మధ్య యుద్ధంగా మారుస్తారా..?

చంద్రబాబు ఇటువంటి పని చేస్తారనే భయంతోనే ఓటర్ల జాబితాను తమ పార్టీ పూర్తిగా విశ్లేషించి 56 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించామని తెలిపారు. ఈ వివరాలతో కూడిన 24 పెన్ డ్రైవ్ లతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో కేసు కూడా వేశామన్నారు. వీటిపై విచారణ జరగకపోగా మరో మూడు లక్షల దొంగ ఓట్లు పెరిగాయన్నారు. దొంగ ఓట్లు ఉన్నాయని… వీటిపై విచారణ జరపాలని మాత్రమే ఫారం-7తో ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఎన్నికల సంఘం చేయాల్సిన పనికి తాము సహకరిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు మాత్రం ఫారం-7 దరఖాస్తులు పెట్టడమే తప్పు అని పోలీసులను పంపించి వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయిస్తున్నారని పేర్కొన్నారు. దొంగ ఓట్లపై విచారణ జరగకుండా చంద్రబాబు అడ్డుకుంటుంటే యెల్లో మీడియా ఆయనకు వంతపాడుతుందన్నారు. ప్రజల డేటాను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ జైలుకు వెళ్లాల్సినంత పెద్ద నేరానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఫారం-7 ఇవ్వడమే తప్పు అన్నట్లు చంద్రబాబు, యెల్లో మీడియా చెప్పడం అన్యాయమన్నారు. దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడే కేసు పెడతారని, నేరం చేసి మళ్లీ ఆంధ్రాకు, తెలంగాణకు మధ్య యుద్ధంగా టీడీపీ చిత్రీకరించడం సరికాదన్నారు. తప్పు చేసిన వారి కార్యాలయాల్లో సోదాలు చేస్తే రెండు రాష్ట్రాల మధ్య గొడవగా మారుస్తారా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News