చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్న

వివేకానందరెడ్డి హత్యలో చంద్రబాబు ప్రమేయం లేకపోతే సీబీఐ లేదా థర్డ్ పార్టీ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. తన చిన్నాన్న [more]

Update: 2019-03-16 11:47 GMT

వివేకానందరెడ్డి హత్యలో చంద్రబాబు ప్రమేయం లేకపోతే సీబీఐ లేదా థర్డ్ పార్టీ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. తన చిన్నాన్న హత్య కేసులో న్యాయం జరగాలని అంటే సీబీఐ విచారణ ద్వారానే సాధ్యమని, చంద్రబాబుకు రిపోర్ట్ చేసే పోలీసులు విచారణ చేస్తే న్యాయం జరగదని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ఈ మేరకు గవర్నర్ నరసింహన్ ను కలిసి సీబీఐ విచారణ కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తనతో ఎస్పీ మాట్లాడుతున్నప్పుడే ఇంటిలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుకు ఎస్పీకి ఫోన్ల మీద ఫోన్లు చేశారని, అటువంటప్పుడు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. వైసీపీలో ఎమ్మెల్యేలను కోనుగోలు చేయడంలో ఇదే వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరించారన్నారు. చనిపోయిన వ్యక్తి 30 ఏళ్లుగా వివిధ పదవుల్లో ప్రజలకు సేవ చేసిన వ్యక్తి అని, అటువంటి వ్యక్తినే హత్య చేశారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

మా చిన్నాన్న చేసిన తప్పేంటి..?

జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిని ఎదుర్కునేందుకు తాము ఓ యువకుడిని పోటీలో పెట్టి, ఆయనను గెలిపించే బాధ్యతను వివేకానందరెడ్డి తీసుకుంటున్నారని, అదే ఆయన చేసిన నేరమా అన్నారు. చంద్రబాబు ఏ తప్పూ చేయకపోతే సీబీఐ విచారణను ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి ఒక్కరే ఇంట్లో ఉంటున్నారని తెలుసుకొని అత్యంత దారుణంగా చంపారని ఆరోపించారు. వెంకటేశ్వరరావు వంటి వ్యక్తులను ఎన్నికల డ్యూటీ నుంచి తప్పించాలని గవర్నర్ ను కోరినట్లు తెలిపారు. ఇటువంటి వ్యక్తులు ఉంటే ఎన్నికల్లో గెలవడానికి ఓట్లు తీసేస్తారని, మనుషులను చంపేస్తారని అన్నారు. ఇవాళ తన చిన్నాన్నకు జరిగింది రేపు ఎవరికి జరుగుతుందో అని ప్రశ్నించారు. రెండు రోజుల్లో సీబీఐ లేదా థర్డ్ పార్టీ విచారణకు ఆదేశాలు రాకపోతే కోర్టుకు కూడా వెళతామన్నారు. చంద్రబాబు మాటలు దొంగతనం చేసిన దొంగే.. దొంగ.. దొంగ అని అరిసినట్లు ఉందన్నారు. వాళ్లే హత్య చేయించి మళ్లీ ఇతరులపై వేసే దారుణ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. తన తాత రాజారెడ్డిని చంపినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అని, తన తండ్రి వైఎస్సార్ ను హెచ్చరించాక రెండు రోజులకే అనుమానాస్పద మృతి చెందారని గుర్తు చేశారు. తనపై హత్యాయత్నం జరిగినప్పుడు, కడప జిల్లాలో ఒక్క స్థానం కూడా గెలవరనే భయంతో తన చిన్నాన్న హత్య చేశారని, ఇప్పుడు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు.

ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి విచారణ చేస్తారా..?

ఆరోపణలు ఎదుర్కుంటున్న చంద్రబాబే విచారణ చేస్తామనడం ఏంటన్నారు. ఈ హత్య ద్వారా తన ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని, కచ్చితంగా చంద్రబాబుకు శిక్ష పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. వివేకానందరెడ్డికి సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదని, నిష్పక్షపాతంగా పనిచేస్తున్న ఎస్పీని రెండు నెలలకే ఎందుకు ట్రాన్స్ ఫర్ చేశారని ప్రశ్నించారు. హంతకుల ముందే తన చిన్నాన్న డ్రైవర్ చేశారని లెటర్ ఎలా రాస్తారని ప్రశ్నించారు. కేసును పక్కదారి పట్టించేందుకు అనేక కథలు అల్లుతారని, చంద్రబాబు ప్రమేయం ఈ కేసులో లేకపోతే సీబీఐ విచారణ వేయించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News