ఉపఎన్నికలపై జగన్ స్పందన...

Update: 2018-06-06 12:30 GMT

ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించేందుకు చంద్రబాబు భయపడ్డారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయించకపోవడం వల్లే ఇవాళ దేశంలో చర్చ ఐదుగురు ఎంపీల వరకే పరిమితమైందని, అదే 25 మంది ఎంపీలు గనుక రాజీనామా చేసి ఉంటే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కచ్చితంగా వచ్చి ఉండేదని చెప్పారు. కానీ, చేతులారా చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని నాశనం చేశారని ఆరోపించారు. పైగా చంద్రబాబు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తమపై బురదజల్లుతున్నారని పేర్కొన్నారు. ఉపఎన్నికలు వస్తే చంద్రబాబు పోటీ పెడతామని అంటున్నారని, అసలు టీడీపీ ప్రత్యేక హోదాకు అనుకూలమా, వ్యతిరేకమా అనేది తేలిపోయిందని స్పష్టం చేశారు. ఉపఎన్నికలు వస్తే టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని ఆయన పేర్కొన్నారు.

ఈ మనిషా రాజ్యాంగం గురించి మాట్లాడేది...

నిజాయితీ, చిత్తశుద్ధితో తమ వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే, చంద్రబాబు మాపైనే బురదజల్లుతున్నారని, వక్రీకరించే అధ్వాహ్న స్థితిలో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలకు కండువా కప్పుకుని, సిగ్గు లేకుండా పక్కన కూర్చోబెట్టుకుంటున్న చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. వైసీపీ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిన వారిపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని ప్రశ్నించారు.

మీడియాపై విమర్శలు...

చేతిలో రెండు పేపర్లు, నాలుగు ఛానళ్లు పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఇతరులపై బురదజల్లుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఇలా అయితే, భవిష్యత్ తరాలకు రాజకీయాలు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉండదని, కేవలం మీడియాను, వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటే సరిపోతుందని అనుకుంటారని పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ లోకి వెళ్లిన వారి తప్పును కనీసం మీడియా కూడా ప్రశ్నించ లేకపోవడం దురదృష్టకరమన్నారు.

Similar News