పంచాయితీ ఎన్నికల్లో చెలరేగిన హింస..ఐదుగురి మృతి

Update: 2018-05-14 08:26 GMT

పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో తీవ్ర హింస చెలరేగింది. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు సీపీఎం, బీజేపీ కార్యకర్తలకు నడుమ తీవ్ర ఘర్షణలు జరిగాయి. కార్యకర్తలు కర్రలు, రాళ్లు, నాటు బాంబులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనల్లో ఇప్పటికే పలు పార్టీలకు చెందిన ఆరుగురు కార్యకర్తలు మరణించారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు బాష్పవాయువు, గాల్లోకి కాల్పులు జరిపారు. భావ్ నగర్లో ఆందోళనకారులు మీడియా వాహనాన్ని ధ్వంసం చేశారు. ఉత్తర 24 పరిగణాల జిల్లాలోని ఓ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న సీపీఎం కార్యకర్త, అతని భార్యను ఆందోళనకారులు సజీవ దహనం చేశారు. మొత్తంగా ఇప్పటికే ఆరుగురు చనిపోవడంతో పాటు వందలాది మంది కార్యకర్తలు గాయాలపాలయ్యారు.

ఇప్పటికే ఎకగ్రీవమైన 20 వేల పంచాయితీలు

పశ్చిమ బెంగాల్ లో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో గెలవడానికి అధికార తృణమూల్ కాంగ్రెస్ హింసకు దిగుతోందని, బీజేపీ, వామపక్షాల కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రస్థుతం రాష్ట్రంలోని 31,836 గ్రామ పంచాయితీలకు, 622 జిల్లా పరిషత్ లకు, 6,158 పంచాయతీ సమితీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 16814 గ్రామ పంచాయితీలను, 203 జిల్లా పరిషత్ లను, 3,059 పంచాయితీ సమితీలను అధికార తృణమూల్ కాంగ్రెస్ పోటీ లేకుండా ఏక్రగీవంగా గెలుచుకుంది. ఇంత పెద్ద ఎత్తున ఏకగ్రీవంగా తృణమూల్ కాంగ్రెస్ గెలిచేందుకు ఆ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న హింసే కారణమని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఇటువంటి ఎన్నికలను ఇంతవరకు చూడలేదు...

బెంగాల్లో ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న హింసను సీపీఎం తీవ్రంగా ఖండించింది. ఎన్నికలలో ఇటువంటి రక్తపాతాన్ని ఇప్పటివరకు దేశంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ చూడలేదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు తృణమూల్ అధికార దుర్వినియోగానికి, హింసకు పాల్పడుతుందన్నారు.

Similar News