బెజ‌వాడ‌లో `కాల్ మ‌నీ` రాజ‌కీయాలు

Update: 2018-06-04 01:30 GMT

దాదాపు రెండేళ్ల కింద‌ట ఏపీని వ‌ణికించిన కాల్ మ‌నీ వ్య‌వ‌హారం..మ‌ళ్లీ తెర‌మీదికి వ‌చ్చింది. అయితే, ఇప్పుడు కొత్త రూపంలో విస్త‌రించేందుకు రెడీ అయింది. కేసులు, కోర్టుల‌కు భ‌య‌ప‌డి త‌ల‌దాచుకున్న నాయకులు ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాజ‌కీయంగా మ‌ళ్లీ యాక్టివ్ అయి.. త‌మ వ్యాపారాల‌ను నిరాఘాటంగా సాగించుకునేందుకు సిద్ద‌మ‌వుతున్నార‌నే వార్తలు వినిపిస్తున్నాయి. విజ‌య‌వాడ కేంద్రంగా అధికార పార్టీకి చెందిన నాయ‌కులు కాల్ మ‌నీ వ్య‌వ‌హారం కింద భారీ ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చారు.

ముఖ్యంగా మ‌హిళ‌లను ట్రాప్‌లోకి తీసుకు వ‌చ్చేందుకు కాల్ మ‌నీ ఉదంతాన్ని వాళ్లు వాడుకున్నారు. ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు.. త‌మ‌కు క‌ల‌సి వ‌చ్చే అన్ని దారుల‌ను వినియోగించుకోవ‌డం ప‌రిపాటి. వ్యాపారానికి రౌడీయిజం, రాజ‌కీయాల‌ను క‌ల‌గ‌లిపి జ‌నాల‌ను దోచేసిన ఈ కాల్ మ‌నీ వ్య‌వ‌హారం అసెంబ్లీని కుదిపేసింది. ఈ క్ర‌మంలోనే సీఎం చంద్ర‌బాబును టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా.. ఏకంగా ఏడాది పాటు స‌భకు దూర‌మ‌య్యారు.

అలాంటి అత్యంత కీలక అంశాన్ని అధికార పార్టీ తెర‌మ‌రుగు చేసింది. పైగా వైసీపీపైనే అప్ప‌ట్లో ఎదురు దాడికి దిగింది. నిజానికి వెయ్యి అప్పుగా ఇచ్చి.. రెండు నుంచి మూడు వేలు గుంజ‌డం.. ఇవ్వ‌క‌పోతే.. మ‌హిళ‌ల‌ను వ్యాపార వ‌స్తువుగా మార్చ‌డం ఈ కాల్ మ‌నీ వెనుక ఉన్న అస‌లైన కిటుకు. ఈ మొత్తం వ్య‌వ‌హారాల‌కు తెర‌వెనుక రాజ‌కీయ నాయ‌కులు కీల‌కంగా మారార‌నేది వాస్త‌వం. కాల్ మనీ ముసుగులో బెజవాడలో ఎన్ని అరాచకాలు వెలుగుచూసినా ఏ ఒక్క పోలీసు అధికారీ ప్రశ్నించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగకపోవడంతో బాధితులు మానసికంగా కుంగిపోయారు. అయితే.. కాల్‌మనీ వ్యవహారంపై ప్రస్తుత సీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి వెళ్లడంతో సీన్ మారిపోయింది.

ఆయన కొరడా ఝళిపించడంతో.. కాలనాగులన్నీ కటకటాల వెనక్కి వెళ్లాయి. కాల్‌మనీ కేసుల కోసమే ప్రత్యేకంగా ఓ సెల్‌తో పాటు.. ఏసీపీ స్థాయి అధికారినీ నియమించడంతో.. ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడ్డాయి. మొత్తం 19 వందల 36 కేసులు రాగా.. 1911 కేసుల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. వీటిలో 971 కేసులు పరిష్కారం అయ్యాయ. మరో 155 కేసులు రిజిస్టర్ చేసి.. 156 మందిని అరెస్ట్ కూడా చేశారు. సవాంగ్‌ దెబ్బకు.. కాల్‌మనీ బిజినెస్ మూతపడింది. కాల్‌మనీ కింగ్‌పిన్స్‌ అంతా.. భయంతో నగరం వదిలి పారిపోయారు. ఇంత వరకు కాల్‌మనీ మాఫియాకు అండగా ఉన్న రాజకీయనేతలూ సైలెంట్ అయిపోయారు. రాజకీయ అండదండలతో రెచ్చిపోయిన కాల్‌మనీ వ్యాపారులకు ఇది మింగుడు పడలేదు.

అందుకే.. తమపై కేసులను తప్పించుకోవడానికి.. ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు.రాజకీయ నాయకుల అవతారం ఎత్తితే.. పోలీసులనుంచి తప్పించుకోవచ్చన్నదే కాల్‌మనీ నాయ‌కుల అసలు ప్లాన్‌. అందుకే.. ప్రధాన పార్టీల అధిష్టానాలతో టచ్‌లోకి వెళ్లారు. కొంతమంది పార్టీల్లో చేరడానికి లైన్‌ కూడా క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగా ... అజ్ఞాతంలో ఉన్న కేటుగాళ్లు.. మళ్లీ బెజవాడకు చేరుకుంటున్నారు. బెజవాడలో భూస్థాపితమైన తమ కాల్ మనీ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రారంభించేందుకు స్కెచ్‌లు వేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చేరడం ద్వారా తమ బలం పెరుగుతుందని ఆశిస్తున్నారు. అదే జరిగితే. .బెజవాడలో మళ్లీ కాల్‌మనీ పడగ విప్పడం ఖాయం.

Similar News