దారికొచ్చిన విజయ్ మాల్యా

Update: 2018-12-06 08:23 GMT

ఎట్టకేలకు ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా దారికొచ్చినట్లు కనిపిస్తోంది. భారత్ లో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి ఆయన లండన్ లో దాచుకున్నారని చాలా రోజులుగా ఆరోపణలు ఉన్నాయి. ఆయనను తమకు అప్పగించాలని లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఈ నెల 10న తీర్పు ఇవ్వనుంది. అయితే, మొన్నటి నుంచి విజయ్ మాల్యా వరుస ట్వీట్లు చేస్తున్నారు. తాను మూడు దశాబ్దాలుగా భారత్ లో అతిపెద్ద మద్యం వ్యాపార సంస్థను నిర్వహించి ప్రభుత్వానికి వేల కోట్లు చెల్లించానని, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కూడా రాష్ట్రాలకు ఆదాయం సమకూర్చిందని గుర్తు చేశారు. కానీ, ఇంధన ధరల పెరుగుదల వల్ల అన్ని విమానయాన సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, అదే విధంగా కింగ్ ఫిషర్ కూడా నష్టాల్లోకి వెళ్లిందన్నారు.

2016 నుంచే చెబుతున్నాను...

అయినా కూడా తాను బ్యాంకులకు మొత్తం డబ్బులు చెల్లిస్తానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎక్కడ ఉన్నా... బ్యాంకులకు మాత్రం 100 శాతం డబ్బులు చెల్లిస్తానని, ఇక ఎగవేతదారుడిగా నా మీద పడ్డ ముద్రను చెరిపేసుకోవాలనుకుంటున్నట్లు విజయ్ మాల్యా ట్వీట్ చేశారు. అయితే, లండన్ కోర్టు ఆయనను భారత్ కు అప్పగిస్తుందనే భయంతోనే విజయ్ మాల్యా ఇప్పుడు రుణాలు చెల్లిస్తానని అంటున్నారని పలు జాతీయ ఛానళ్లు కథనాలు ఇచ్చాయి. వీటిని కూడా విజయ్ మాల్యా ట్విట్టర్ ద్వారా ఖండిచారు. 2016 నుంచే తాను సెటిల్ మెంట్ ఆఫర్ ను బ్యాంకుల ముందు ఉంచానని, రుణాలు తిరిగి చెల్లిస్తున్నానని గుర్తు చేశారు.

Similar News