వంగ‌వీటి ఫ్యామిలీ నుంచి టీడీపీలోకి కీల‌క నాయ‌కుడు ?

Update: 2018-06-04 06:55 GMT

రాష్ట్ర రాజ‌కీయాల్లో.. ముఖ్యంగా బెజ‌వాడ రాజ‌కీయాల్లో సంచ‌ల‌న ఘ‌ట్టం న‌మోదు కానుంది. ఏ పార్టీని త‌లుచుకుంటే.. వంగ‌వీటి వంశం నిలువెల్లా ఆగ్ర‌హంతో ఊగిపోతుందో? ఏ పార్టీని త‌లుచుకుని.. మాట‌ల తూటాల‌ను పేలుస్తుందో.? అదే కుటుంబం నుంచి కీల‌క నేత ఒక‌రు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఆ పార్టీ జెండాను మోసేందుకు రెడీ అయ్యారు! ఈ ఊహించ‌ని ప‌రిణామం బెజ‌వాడ రాజ‌కీయాల‌ను ఒక్క‌సారిగా కుదిపేసింది. కొన్ని ద‌శాబ్దాల త‌ర‌బ‌డి.. వంగ‌వీటి రంగా, రాధాల‌కు టీడీపీకి న‌డుమ ప‌చ్చ‌గ‌డ్డి వేస్తేనే భ‌గ్గుమనేది. నిజానికి రంగా హ‌త్యకు టీడీపీలో అప్ప‌ట్లో కీల‌కంగా చ‌క్రం తిప్పిన నాయ‌కుల‌కు పెద్ద సంబంధం ఉంద‌ని వార్తలు ఇప్ప‌టికీ హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. మొత్తంగా టీడీపీ అంటే వంగ‌వీటి.. వంగ‌వీటి అంటే టీడీపీకి అస్స‌లు ప‌డ‌ని వాతావ‌ర‌ణం నెల‌కొంది.

రాధా-రంగా మిత్ర‌మండ‌లిలో కీల‌కంగా...

అలాంటి వంగ‌వీటి ఫ్యామిలీ నుంచి కీల‌కంగా ఇప్ప‌టి వ‌ర‌కు చ‌క్రం తిప్పిన చెన్నుపాటి శ్రీను టీడీపీలోకి త్వ‌ర‌లోనే జంప్ చేసే చాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్ప‌టికే ఆయ‌న ఓ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి రాధా-రంగా మిత్ర‌మండ‌లి ప‌క్షాన ప్ర‌జా సేవ చేస్తూ.. ఎంతో పేరు తెచ్చుకున్నాడు చెన్నుపాటి శ్రీను. మాస్ పీపుల్‌కు ఎంతో చేరువ‌లో ఉంటూ గ‌తంలో రంగా పేరును ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో నిల‌బెడుతున్న‌వారిలో ప్ర‌ధానంగా నిలిచాడు. వంగ‌వీటి త‌న‌యుడు రాధాకు ఆయ‌న పెద్ద గైడ్‌లా వెన్నంటే నిలిచారు. అయితే, ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్నాడ‌ని, అందుకే స‌రైన పార్టీ కోసం ఎదురు చూస్తున్నార‌ని గ‌త కొన్నాళ్లుగా వార్త‌లు హ‌ల్ చేస్తున్నాయి. అయితే, ఏదైనా పార్టీ అంటే .. టీడీపీ అని మాత్రం ఎవరూ ఊహించ‌లేదు.

ఆత్మీయ స‌మావేశంలో...

నిన్న‌టికి నిన్న విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్‌లో రంగా మిత్రమండలి ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశాన్ని చెన్నుపాటి శ్రీను నిర్వహించారు. రాధా-రంగా మిత్రమండలి సభ్యులుగా ఉన్న రెండువేలకు పైగా సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ రాధా, రంగ మిత్రమండలి సభ్యులకు అభిమానులు, స్నేహితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాధా, రంగాలు ఎంతో కృషిచేశారన్నారు.ఈ క్ర‌మంలోనే రెండ్రోజుల్లో త‌న‌ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం ప్రకటిస్తాన‌ని చెప్పారు. రాధా, రంగాల ఆశయ సాధన కోసం ఏ పార్టీ పాటుపడుతుందని భావిస్తే.. ఆ పార్టీకి చేరువవుతా. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా మీ అభిప్రాయం మేరకే తీసుకుంటాన‌ని చెన్నుపాటి శ్రీను అన్నారు.

ఇక ముహూర్త‌మే త‌రువాయి...

తెలుగుదేశం పార్టీలోకి చేరాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్న చెన్నుపాటి శ్రీను ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆ విషయం వేదిక మీద చెప్పకపోయినా.. తెర వెనుక టీడీపీ నేతలు ఈ కార్యక్రమ నిర్వహణకు దోహదపడటం గమనార్హం. రాధా - రంగా మిత్రమండలి సభ్యులతో పాటు టీడీపీకి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్రల్‌ కార్యాలయ కార్యదర్శి కళ్ళే నాగేశ్వరరావు సమావేశానికి వచ్చే వారికి స్వాగతం చెబుతూ సమావేశం జరుగుతున్న ఐవీప్యాలెస్‌ బయట బ్యానర్లను కూడా కట్టించారు. పలువురు టీడీపీ కార్పొరేటర్ల అనుచరులు సమావేశానికి హాజరయ్యారు. దీనిని బ‌ట్టి.. రేపో మాపో.. చెన్నుపాటి శ్రీను టీడీపీ ఎంట్రీ ఖాయ‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

Similar News