వరదలో చిక్కుకుని ప్రాణాలు దక్కించుకున్న53 మంది అదృష్టవంతులు

Update: 2018-07-17 03:03 GMT

తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన పడవ ప్రమాదం మిగిల్చిన విషాదం నుంచి బయట పడకముందే ఇలాంటి సంఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న 53 మంది ఇసుక కూలీలు ప్రాణాలు దక్కించుని మృత్యు కౌగిలినుంచి బయట పడిన తీరు హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాకుళం జిల్లా పురుషోత్తంపురం దగ్గర వంశధార నదీ తీరంలో రాత్రి 11 గంటల సమయంలో ఇసుక తవ్వకానికి వెళ్లారు 53 మంది కూలీలు. రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు కావడంతో అర్ధరాత్రి నదీ తీరంలో దిగి ఇసుక తవ్వకం మొదలు పెట్టారు వీరంతా.

భారీ వర్షాలతో గేట్లు ఎత్తేసిన గొట్టా బ్యారేజ్ ..

ఒడిశాలో కూడా భారీ వర్షాలు పడుతూ ఉండటంతో వంశధార ఉప్పొంగింది. గొట్టా బ్యారేజ్ లో వరద పరవళ్లు తొక్కడంతో అధికారులు గేట్లు ఎత్తేశారు. బ్యారేజ్ నుంచి ఒక్కసారిగా 58 వేలక్యూసెక్కుల వరదనీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతానికి ప్రవహించింది. ఆ సమయంలో ఇసుక లోడింగ్ లో వున్న కూలీలు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఏమి చేయాలో పాలుపోక అక్కడి ఇసుక టిప్పర్ పై భాగానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ లో తమ పరిస్థితి వివరించారు. ఈలోగా వరద ఉధృతి మరింత పెరగడం టిప్పర్ లారీలు కూడా నీట మునిగిపోతుండటంతో జెసిబిలపై చేరుకున్నారు వారంతా. ఆ ప్రాంతానికి వచ్చి చూసిన అధికారులు చిమ్మ చీకటిలో ఎక్కడి వారిని అక్కడే ఉండమని ఈత వచ్చినా వచ్చే ప్రయత్నం చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు.

సురక్షితంగా ఒడ్డుకు ....

ఉదయం కాగానే రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టి అందరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన కూలీలంతా కుటుంబ సభ్యులను చేరుకొని కన్నీరు మున్నీరు అయ్యారు. తమను కాపాడిన అగ్నిమాపక , పోలీస్, రెవెన్యూ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం మరో నాలుగు రోజులు ఉంటుందని తెలుగు రాష్ట్రాల్లోని వారంతా అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Similar News