హెల్త్ బులిటెన్ ఎందుకు విడుదల చేయలేదు?

Update: 2018-06-13 03:29 GMT

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా? మంగళవారం సాయంత్రం ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ ఎందుకు విడుదల చేయలేదు. ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేయకపోవడంతో వాజ్ పేయి అభిమానుల్లోనూ, బీజేపీ కార్యకర్తల్లోనూ ఆందోళన బయలుదేరింది. గత సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు మంగళవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయంత్రం విడుదల చేయకపోవడం అనుమానాలకు తావిస్తుంది. వాజ్ పేయి శ్వాసకోశ, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఆయనను అత్యవసర చికిత్స విభాగంలో ఉంచి ఎయిమ్స్ డైరెక్టర్ రణదీవ్ గులేరా నేతృత్వంలోని బృందం వైద్య సేవలను అందిస్తుంది. కాగా వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు మంగళవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ లు ఎయిమ్స్ కు వచ్చారు.

Similar News