ఆ పని మాత్రం చేయకండి..ప్లీజ్..

Update: 2018-06-06 18:29 GMT

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ కు మరో కొత్త సమస్య వచ్చి పడింది. ఇప్పటికే ఉప ఎన్నికల్లో వరుస ఓటములతో పాటు పాలనా వైఫల్యాలపై ఇంటా బయటా ఆరోపణలు ఎదుర్కొంటున్న యోగీకి తాజాగా యోగా గురువు బాబా రాందేవ్ చుక్కలు చూపించారు. దీంతో దెబ్బకు అలెర్టయిన యోగీ.. బాబా రాందేవ్ కు ఫోన్ చేసి బతిమాల్సి వచ్చింది.

పెద్దఎత్తున ఉపాధి...

ఉత్తర ప్రదేశ్ లో యమునా ఎక్స్ ప్రెస్ వేకు సమీపంలోని 425 ఎకరాల్లో రూ.6,000 కోట్లతో బాబా రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థ మెగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలనుకుంది. ఇందుకు సంబంధించి గతంలోనే ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రతీయేటా రూ.25 వేల కోట్ల విలువైన ఉత్పత్తి జరుగుతుంది. సుమారు పది వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వేల సంఖ్యలో రైతులకు కూడా మేలు జరగనుంది. అయితే, యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన ఫైళ్లు మాత్రం యూపీ ప్రభుత్వం వద్ద వేగంగా కదలడం లేదు. యూనిట్ ఏర్పాటుకు అనుమతులు రావడం లేదు.

ఫోన్ చేసి బతిమిలాడిన యోగీ...

దీంతో చిర్రెత్తుకొచ్చిన పతంజలి నిర్వాహకులు, తాము ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కి వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు. తమకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహకరించడం లేదని, అందుకే ప్రాజెక్టు నుంచి వెనక్కు వెళుతున్నట్లు పతంజలి సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. దీంతో ఒక్కసారిగా ముఖ్యమంత్రికి షాక్ తగిలినట్లయింది. దీంతో యోగీ ఆధిత్యనాథ్ వెంటనే బాబా రాందేవ్ కి ఫోన్ చేసి.. ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు చివరి దశలో ఉన్నాయని, చిన్న చిన్న సమస్యల వల్లె ఆలస్యం అవుతుందని నచ్చజెప్పారు. సాధ్యమైనంత త్వరలో అన్ని క్లియరెన్సులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో మెత్తబడ్డ రాందేవ్ సరేనన్నాడు.

Similar News