గాంధీ భవన్ గేట్లు తెరిచారు.. ఎవరైనా రావచ్చు..!

Update: 2018-08-03 13:14 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల లొల్లి ముదురుతోంది. పార్టీలోకి వస్తామని పలువురు వివిధ పార్టీల నేతలు ముందుకొస్తున్న సమయంలో ఇప్పటికే ఉన్న పాత నేతల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలో నాగం జనార్ధన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పార్టీ మారారు. ఇక రేవంత్ రెడ్డి పార్టీలో చేరిన సమయంలో కంచర్ల భూపాల్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు వంటి నాయకులు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడినా, స్థానికంగా కాంగ్రెస్ లో అప్పటికే ఉన్న నేతలు వ్యతిరేకించడంతో వారు టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని గెలిపించాలని పట్టుదలతో ఉన్న ఆ పార్టీ పెద్దలు చేరికలను స్వాగతించాలని భావిస్తున్నారు.

పార్టీకి ద్రోహం చేసిన వారిని తీసుకుంటారా..?

ఇందులో భాగంగా పీసీసీ ఇంఛార్జి ఆర్.సి.కుంతియా ఆధ్వర్యంలో సీనియర్ నేతలతో కూడిన సంప్రదింపుల కమిటీ సమావేశం శుక్రవారం గాంధీ భవన్ లో జరిగింది. ఇందులో ముఖ్యంగా డీఎస్ అంశంతో పాటు పలువురు మహబూబ్ నగర్ జిల్లా నేతల రాకకు సంబంధించి తీవ్ర చర్చ జరిగింది. పార్టీలోకి ఎవరిని పడితే వారిని చేర్చుకోవద్దని, గతంలో పార్టీలో అనేక పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీ వీడిన డి.శ్రీనివాస్ ను మళ్లీ చేర్చుకోవద్దని పలువురు నేతలు సూచించారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత శివకుమార్ రెడ్డి, జడ్చర్లకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ వంటి వారి రాకను మహబూబ్ నగర్ కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకంచారు. సంప్రదింపుల కమిటీని కలిసి ఈ మేరకు కోరారు. ఇక అదే జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత పార్టీలోకి వస్తానంటున్నారని జానారెడ్డి చెప్పారు. ఎవరో చెప్పాలని డీకే అరుణ అడగగా, సమరసింహారెడ్డి వస్తానని అడుగుతున్నట్లు చెప్పారు. సమరసింహారెడ్డి రాకపై తమకు అభ్యంతరంలేదని, ఆయనను చేర్చుకుని మహబూబ్ నగర్ ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని ఆమె సూచించినట్లు సమాచారం.

పార్టీ వీడిన వారినీ ఆహ్వానిద్దాం...

అనేక సంప్రదింపుల తర్వాత పార్టీలో చేరికలను స్వాగతించాలని నిర్ణయించారు. పార్టీని బలోపేతం చేయాలంటే నేతలను చేర్చుకోవాలని నిర్ణయించారు. కొత్త నేతలు వస్తామంటే వద్దనడం సరికాదని కుంతియా నేతలకు నచ్చజెప్పారు. అయితే, పార్టీలోకి కొత్త నేతలు వచ్చినప్పుడు అప్పటికే ఉన్న పాత నేతలకు నచ్చజెప్పాలని, కొత్త, పాత నేతల మధ్య పీసీసీ సమన్వయం చేయాలని సీనియర్ నాయకురాలు డీకే అరుణ కోరారు. ఇలా సమన్వయ చేయనందుకే ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పార్టీ మారారని ఆమె గుర్తు చేశారు. అయితే, ఇక నుంచి పార్టీలోకి నేతలను, గతంలో పార్టీ వీడిన నేతలను ఆహ్వానించాలని, పాత నేతలకు ప్రాధాన్యం తగ్గకుండా కొత్తవారికి అవకాశాలు కల్పించాలనే నిర్ణయానికి వచ్చారు.

Similar News